కదం తొక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు
● పాడేరులో భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా
● వేతనాలు పెంచాలని డిమాండ్
సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా వేతనాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరులో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సినిమాహాల్ సెంటర్, ఐటీడీఏ, తలారిసింగి జంక్షన్‌ల మీదుగా కలెక్టరేట్ వరకు అంగన్‌వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేరేట్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కలెక్టరేట్ హోరెత్తింది. అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.నాగమ్మ, కె.భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గతంలో 42 రోజులు అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె సమయంలో అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, దీని ప్రకారం అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు వేతనాలు వెంటనే పెంచాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోని అధికారులకు వారంతా వినతిపత్రం అందజేశారు.
కదం తొక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు


