ఘాట్ ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం
రంపచోడవరం: మారేడుమిల్లి– చింతూరు మధ్య ఉన్న ఘాట్ రోడ్డు ప్రయాణమంటే గుండె దడదడలాడుతుంది. ఎత్తయిన పర్వతాలపై అనేక మలుపులతో ఉన్న ఘాట్ రోడ్డుపై అనుభవం ఉన్న డ్రైవర్లులు సైతం వాహనాన్ని నడపడానికి తడబడతారు. శీతాకాలం పగటి ఉష్టోగ్రత సైతం అత్యల్పంగా ఉండే ఇక్కడ అటవీ ప్రాంతంలో రాత్రివేళ మంచు దట్టంగా కమ్ముకుంటుంది. పగటి వేళ సైతం ఎదురుగా వస్తున్న వాహనాలు వంద మీటర్లు దూరంలో ఉన్నప్పటికి కంటి చూపుకు కనిపించని పరిస్దితి ఉంటుంది.
● దట్టమైన పొగమంచు కురిసే రాత్రి వేళ ఇక్కడ ఘాట్ పై ప్రయాణం అంటే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే. కనీసం ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకుని వెళ్లే పరిస్దితి కూడా ఇక్కడ రహదారిపై లేదు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ రహదారి పక్కనే ప్రమాదకరమైన లోయలు ఉన్నాయి. ఈ రహదారిపై రక్షణ గోడలు లేవు, అలాగే కనీసం మలుపులను సూచించే బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది. రోడ్లు భవనాల శాఖ ఈ రహదారి వైపు కన్నెత్తి చూడకపోవడం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది.
తూతూమంత్రంగా చర్యలు
ఇక్కడ సురక్షిత ప్రయాణానికి అనేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ తూతూ మంత్రంగా రెండు రోజులు హడావుడి చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. దీంతో మారేడుమిల్లి –చింతూరు ఘాట్ రోడ్డు ప్రయాణికుల పాలిట మృత్యు రహదారిగా మారింది.
● మారేడుమిల్లి ప్రాంతం సముద్రమట్టానికి 300 అడుగులు ఎత్తులో ఉండడంతో సాధారణ రోజుల్లో కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. శుక్రవారం ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు పొగమంచులో రోడ్డు పక్కన సరిగా అంచనా వేయకపోవడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు.
సింగిల్ రోడ్డుతో ఇబ్బందులే....:
మారేడుమిల్లి–చింతూరు ఘాట్ 28 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ రోడ్డులో కొంత భాగం ఎదురుగా వచ్చే వాహనం తప్పుకునే అవకాశం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేస్తే కొంత వరకు ఇబ్బందులు తప్పుతాయని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఈ ఘాట్ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు.


