అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
హత్యకోణంలో పోలీసుల దర్యాప్తు
కూర్మన్నపాలెం: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వెములపూడి విజయకుమార్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన 86వ వార్డు భరత్‌నగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల మేరకు ఈ సంఘటన జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సుంకర పంచాయతీ, పెదజాడుమూరుకు చెందిన విజయకుమార్ సుమారు నెల రోజుల క్రితం కూర్మన్నపాలెంకు వచ్చి శాతవాహననగర్ జాతీయ రహదారిపై ఉన్న కార్ల వాషింగ్ సెంటర్‌లో పనికి కుదిరాడు. ఆ సెంటర్ యజమాని ఇచ్చిన గదిలో ఉంటున్నాడు. ఐదు రోజుల క్రితం విజయకుమార్ తన సొంత గ్రామానికి సమీపంలోని గ్రామానికి చెందిన ఒక మహిళా పరిచయస్తురాలిని కూర్మన్నపాలెం రావాలని ఫోన్‌లో కోరాడు. పని దొరికిందని, ఇద్దరం కలిసి బతుకుదామని ఆమెకు చెప్పాడు. దీంతో ఆ మహిళ తనతో పాటు మరో ఇద్దరు మహిళలను తీసుకొనివచ్చింది. వీరందరూ మూడు రోజుల పాటు సర్వీసింగ్ సెంటర్ యజమాని ఇచ్చిన గదిలోనే ఉన్నారు. యజమాని గది ఖాళీ చేయాలని చెప్పడంతో.. వారు భరత్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడికి మకాం మార్చారు. నలుగురు అక్కడే ఉన్నప్పటికీ శుక్రవారం విజయకుమార్ ప్రియురాలితో పాటు మిగిలిన ఇద్దరు మహిళలు వెళ్లిపోయారు. అయితే సాయంత్రం వేళ విజయకుమార్ సొంత ఊరు నుంచి బంధువులు పోలీసులకు ఫోన్ చేసి, విజయకుమార్ తన గదిలో చనిపోయి ఉన్నాడని సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మృతదేహాన్ని పరిశీలించగా.. విజయకుమార్ మెడపై తాడుతో కోసిన మచ్చలు ఉన్నట్లు గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. విజయకుమార్‌తో పాటు గదిలో ఉన్నవారికి ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి. దీంతో పోలీసులు విజయకుమార్ హత్యకు గురైనట్టు అనుమానం వ్యక్తం చేశారు. అదే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి


