వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే ఉద్యమం ఉధృతం
పాడేరు రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెడితే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ జాతీయ సమితి నాయకుడు జేవీ సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. శుక్రవారం ఆయన పాడేరు పర్యటనలో భాగంగా మోదకొండమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందకుండా దూరం చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను విక్రయించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. ఆదివాసీల హక్కుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపై నడుస్తున్నాయని విమర్శించారు. అనవసరమైన వ్యవహారాలను పార్లమెంట్‌లో చర్చకు తీసుకువచ్చి సమయం వృథా చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మావోయిస్టు అగ్రనేత ిహిడ్మాను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. మన్యంలో ఉన్న అటవీ సంపదను అంబానీ, అదానీ వంటి బడాబాబులకు కట్టబెటడం కోసమే ఉద్యమ నేతలను కాల్చి చంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, రాష్ట్ర సమితి నాయకులు వెంకటరమణ, కుంజ రామ్మోహన్‌రావు, రాధాకృష్ణ, కుమార్, సింహాచలం, జల్లి రాజుబాబుఅమర్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి నాయకుడు
జేవీ సత్యనారాయణమూర్తి


