కిక్కిరిసిన బస్సులు.. విద్యార్థుల అగచాట్లు
రాజవొమ్మంగి: మండలకేంద్రంలో పాఠశాలలు విడిచిపెట్టే సమయానికి బస్సులు రాకపోవడంతో పాటు వచ్చినా నిలపకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాజవొమ్మంగి బస్టాప్ వద్ద బస్సులు నిలపకపోవడంతో పాఠశాల విద్యార్థులు అవాక్యయ్యారు. తరువాత ప్రయాణికులతో కిక్కిరిసిన ఒక బస్సు రావడంతో ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెట్టారు. కొంతమంది బస్సులో, మరికొందరు ప్రైవేట్ వాహనాల్లో ఇళ్లకు చేరారు. ఇదిలా ఉండగా రాజవొమ్మంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం సాయంత్రం కొయ్యూరు మండలం రేవళ్ల గ్రామానికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. పాసులు లేని విద్యార్థుల బస్సు నుంచి దిగిపోవాలని కండక్టర్ ఒత్తిడి తీసుకొని రావడంతో పలువురు చిన్నారులు మార్గమధ్యలోనే బస్సు దిగిపోయారు. చీకటిపడిన వేళ గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో ఇళ్లకు చేరారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ కండక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు సమయానుకూలంగా సర్వీసులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరారు.


