కొత్త పంచాయతీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
● ఇంటి పన్నుల వసూలులో
రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం
● జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్
కొయ్యూరు: పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తులను సంబంధిత ప్రాంతాల నుంచి స్వీకరిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. గురువారం ఆయన కొయ్యూరులో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రామాలు, జనాభా, విస్తీర్ణం ఆధారంగా కొత్త పంచాయతీలకు అవకాశం ఉంటుందన్నారు. తమకు అందిన వినతులను కలెక్టర్ ద్వారా పంచాయతీ రాజ్ కమిషనర్‌కు పంపిస్తామని తెలిపారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా గ్రామాల్లో సేవా పన్ను వసూలు చేస్తున్నామన్నారు. ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం రూ.13.56 కోట్లు వసూలు కావలసి ఉండగా రూ.3.71 కోట్లు (27.2శాతం) వసూలు చేసినట్టు చెప్పారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజలను చెత్త తరలింపునకు సంబంధించి సమాచారం ఇస్తున్నారన్నారు. చెల్లింపులు డిజిటల్ కావడంతో అంతా పారదర్శకంగా ఉందన్నారు. పర్యావరణ హితంగా పంచాయతీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీటికి కలెక్టర్ రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అదనపు నిధులు ఇస్తారన్నారు. చెత్త తరలించేందుకు వీలుగా జిల్లాకు 400 వాహనాలు త్వరలో వస్తాయన్నారు. పంచాయతీల్లో వనరులను గుర్తించి ఆదాయం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ వెయ్యి గృహాలకు ఒక గ్రీన్ అంబాసిడార్‌గా ఉన్న మహిళలు చెత్తను తరలిస్తారని తెలిపారు.


