డిప్యూటీ డీఎంహెచ్‌వోపై విచారణ
చింతూరు: స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్యపై డివిజన్లోని పలు పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆయనపై స్థానిక వైద్యశాఖ కార్యాలయంలో రహస్య విచారణ సాగుతోంది. తీవ్రమైన వేధింపులు, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలతో వివిధ పీహెచ్‌సీలకు చెందిన ఆరుగురు వైద్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ డీఎంహెచ్‌వోతో పాటు ఆయనపై ఆరోపణలు చేసిన వైద్యులను నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్‌లైండ్‌నెస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్‌నాయక్ విచారిస్తున్నారు. దీనిలోభాగంగా గురువారం 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వైద్యులకు అందచేసి వారు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. కాగా విచారణ అధికారి శుక్రవారం డివిజన్లోని రేఖపల్లి, కూనవరం, కూటూరు, నెల్లిపాక పీహెచ్‌సీలను సందర్శించారు. ఆరోపణలు చేసిన సంబంధిత వైద్యుల నుంచి ప్రశ్నావళికి సంబంధించిన సమాధానాలు, ఆధారాలు స్వీకరించారు. తదుపరి విచారణను వీడియో కాన్ఫరెన్సు ద్వారా త్వరలోనే నిర్వహిస్తామని విచారణ అధికారి తెలిపారని, ఉన్నతాధికారుల ఆదేశాలతో సాగిన ఈ విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు విచారణలో పాల్గొన్న వైద్యులు శ్రీనివాస్‌దొర, రాజీవ్, రోజారమణి, సూర్యప్రకాష్, అనిల్‌కుమార్, నిఖిల్ తెలిపారు.


