నక్కపల్లిలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు
నక్కపల్లి: ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లి హాకీ మైదానంలో అండర్– 19 బాల, బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల విన్యాసాలు, మార్చ్‌ఫాస్ట్, క్రీడా జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం స్వీకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఏజెన్సీ బాలికలు థింసా నృత్యం ప్రదర్శించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ 69వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయన్నారు. నక్కపల్లిలో 40 నుంచి 50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారన్నారు. బాలికలకు క్రికెటర్ చరణ్‌శ్రీ ఆదర్శమన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. నక్కపల్లిలో త్వరలో హాకీ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి డీవైఈవోలు ఉమారాణి, వినోద్‌బాబు, ఆర్‌ఐవో మురళి, డీఎస్‌డీవో పూజారి శైలజ, ఆర్గనైజింగ్ కార్యదర్శి పుష్పలత, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్ పాల్గొన్నారు.


