కనకమహాలక్ష్మికి మార్గశిర శోభ
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు శనివారం భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, సహస్రనామార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు. మండపంలో శ్రీచక్ర నవావరణార్చన, లక్ష్మీహోమం, మార్గశిర మాస కుంకుమార్చనలు వంటి వైదిక కార్యక్రమాలు, వేదపారాయణలు జరిగాయి. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన, పంచహారతులు నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 2 వేల మంది భక్తులకు అన్నసమారాధన చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మార్గశిర పంచామృతాభిషేకంలో పాల్గొనేందుకు గురువారం రూ.10 వేలు, మిగిలిన రోజుల్లో రూ.3 వేలు చెల్లించాలి. క్షీరాభిషేకం(గురువారం మినహా) రూ.1,116, విశిష్ట దర్శనం రూ.500గా నిర్ణయించారు. భక్తులు www. aptemples.ap.gov.in లేదా వాట్సప్ గవర్నెన్స్ నంబరు9552300009 ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రూ.500, రూ.200, రూ.100 దర్శనాలతో పాటు ధర్మ దర్శనం కోసం టౌన్‌కొత్తరోడ్డు నుంచి వయా రీడింగ్ రూమ్ గుండా ప్రధాన ఆలయం వరకు మార్గం ఉంటుంది.


