ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత
రహదారిపై నినాదాలు చేస్తున్న అఖిలపక్ష నాయకులు, ప్రజలు
రహదారికి అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ఆందోళన చేస్తున్న ప్రజలు
ఎటపాక: ఇసుక రవాణా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీలోని నాలుగు గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు, అఖిలపక్షం నాయకులు సుమారు 16 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి గోదావరి నదిలో ఇసుకను నిత్యం వందలాది లారీల్లో తెలంగాణాకు తరలిస్తున్నారు. మండల కేంద్రం ఎటపాక నుంచి కన్నాయిగూడెం వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రాలోని ఎటపాక మండల పరిధిలోకి వస్తుంది. ఇసుక లారీలు నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ఈ రహదారి ధ్వంసమైంది. అడుగడుగునా గోతులు ఏర్పడడంతో వాహనచోదకులు నరకయాతన పడుతున్నారు. ఇసుక లారీల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. రాత్రి వేళ ఈ రహదారిపై ప్రయాణించేందుకు భయాందోళనలు చెందుతున్నారు. పర్ణశాలను సందర్శించేందుకు వెళ్లే యాత్రికులు కూడా నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈక్రమంలో విసిగిపోయిన కన్నాయిగూడెం పంచాయతీ ప్రజలు ఆదివారం రాత్రి రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ సాగింది. దీంతో 16 గంటల పాటు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఇసుక లారీలను నియంత్రించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ సుబ్బారావు, సీఐ కన్నపరాజు ఆందోళనకారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌తో నిరసనకారులతో ఫోన్‌లో మాట్లాడించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. రహదారికి మరమ్మతులు చేపట్టి, తరువాత రోడ్డు నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఆందోళన విరమించారు.
తెలంగాణ కు ఇసుక రవాణాను
అడ్డుకున్న అఖిలపక్ష నేతలు
ఇసుక లారీలతో ఆంధ్రా రోడ్డు
శిథిలమైందని ఆందోళన
జాతీయ రహదారిపై బైఠాయింపు
దిగొచ్చిన అధికారులు
రోడ్డు అభివృద్ధికి హామీతో ఆందోళన విరమణ
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత


