కన్నబిడ్డను కనులారా చూడకుండానే..
ప్రసవించిన కొద్ది గంటల్లో బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించినట్టు బంధువుల ఆరోపణ
రంపచోడవరం: నవమాసాలు మోసి, బిడ్డను కని...అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లికన్ను మూసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించిందని బంధువులు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన కోటం బాపనమ్మ (33 ) ప్రసవ కోసం 12 రోజుల ముందుగానే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చేరింది. 19వ తేదీన పురిటినొప్పులు రావడంతో ఆమెను ఉదయం ఆరు గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. 8 గంటల వరకు ఆపరేషన్ థియేటర్‌లో ఉంచి ప్రసవం చేసే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో బిడ్డ కొంత భాగం బయటకు వచ్చి ఆగిపోయిందని, ఆ సమయంలో డాక్టర్లు హడావుడిగా ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో రక్తం పోవడంతో ఆమె పూర్తిగా నల్లగా మారిపోయి, చలనం లేకుండా ఉందని చెప్పారు. ఉమ్మునీరు తాగాడని పుట్టిన మగ బిడ్డను కాకినాడ జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. తల్లిని ఆదివారం రాత్రి వరకు ఏరియా ఆస్పత్రిలో ఉంచి, రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో రాజమహేంద్రవరం ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు తల్లిని కాపాడేందుకు విఫల ప్రయ త్నం చేసినా ఫలితం లేకపోయింది. బాపనమ్మ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
ప్రసవం కోసం ముందుగానే వచ్చినా...
రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందించేందుకు అన్ని రకాల హంగులు ఉన్నా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రవసం కోసం వచ్చిన నలుగురు గర్భిణులు మృతి చెందారు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గైనిక్ నిపుణులు ఉన్నా గర్భిణులకు ప్రాణ గండం తప్పడం లేదు. కోటం బాపనమ్మ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని బంధువులు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయ కులు ఆరోపిస్తున్నారు. ప్రసవం కోసం గర్భిణి 12 రోజులు ముందుగానే వచ్చి బర్త్ వెయింటింగ్ హాల్‌లో చేరినా వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
కోటం బాపనమ్మ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వరుస మరణాలు సంభవిస్తున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో జరిగిన మరణాలపై కలెక్టర్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యేవి కావన్నారు. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువుకు మంచి వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


