ఊళ్లకు నీళ్లేవి?
గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరుఅందించాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జలజీవన్ మిషన్ పనుల ఆశయానికి కూటమి ప్రభుత్వం గండి కొడుతోంది. జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున పనులను ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
జలజీవన్ మిషన్‌కు ‘కూటమి’ గ్రహణం
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి జల్‌జీవన్ మిషన్ తాగునీటి పథకాల పనులకు గండం ఏర్పడింది. ఈ పథకానికి సంబంధించి టెండర్ల ద్వారా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా పనులను ఎక్కడిక్కడ నిలిపివేశారు. దీంతో గిరిజనులకు తాగునీటి వెతలు తప్పడం లేదు. గడచిన వేసవిలోను తాగునీటి పథకాల పనులు పూర్తికాక గిరిజనులంతా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
● జిల్లావ్యాప్తంగా 421 తాగునీటి పథకాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జల్‌జీవన్ మిషన్‌లో కాంట్రాక్టర్లంతా ఈ పనులను రెండేళ్ల నుంచి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులు చెల్లించకపోవడంతో పనులన్నింటిని కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ట్యాంకులు, ఇంటింటికి కుళాయిలు, బోరుబావి పనులు పూర్తిగా జరగకపోవడంతో జల్‌జీవన్ మిషన్ పనులన్నీ అలంకారప్రాయంగా మారాయి. చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 421 తాగునీటి పథకాల పనులకు సంబంధించి రూ.21,06, 80,307లు వారికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
● జల్‌జీవన్ మిషన్ పథకంలో చేపట్టిన పనులకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లంతా ఆందోళన బాట పట్టారు. చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే మిగిలిన పెండింగ్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్లర్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయింది. ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన కాంట్రాక్టర్లంతా కూటమి ప్రభుత్వ మొండి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించాలన్న డిమాండ్‌తో విజయవాడలో ధర్నా చేస్తున్నారు.
తాగునీటికి ఇబ్బందులుపడుతున్నాం
పాతపాడేరులో జల్‌జీవన్ మిషన్ పనులు సగం వరకు మాత్రమే జరిగాయి. బిల్లులు ఇవ్వలేదని చెబుతూ పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేసినా తాగునీటి సరఫరా వ్యవస్థ పనులు జరగక నిరుపయోగంగా మారాయి. దీనివల్ల తాగునీటి సమస్య పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నాం.
– సల్లా భీమలింగం, పాత పాడేరు
గ్రామాల్లో నిలిచిన నిర్మాణ పనులు
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని
రాష్ట్ర ప్రభుత్వం
421 పనులకు రూ.21 కోట్లు పెండింగ్
పథకాల నిర్మాణాన్ని
అసంపూర్తిగా వదిలేసిన వైనం
అలంకారప్రాయంగా కుళాయిలు
ఊళ్లకు నీళ్లేవి?


