సుగంధ ద్రవ్య పంటలతో అధిక ఆదాయం
చింతపల్లి: సుగంధ ద్రవ్య పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులతో అధిక ఆదాయం పొందవచ్చని స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. గురువారం స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానంలో జాతీయ సుగంధ ద్రవ్య పంటల బోర్డు సౌజన్యంతో రైతులకు పసుపు, అల్లం, పిప్పలు, మిరియం, చింతపండు పంట ఉత్పత్తుల నాణ్యతపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఏడీఆర్ పసుపుసాగులో మెలకువలు, సస్యరక్షణ, పంట కోత అనంతరం యాజమాన్య పద్ధతులు వివరించారు. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, అనువైన రకాల ఎంపిక, సస్యరక్షణ, కలుపు నివారణ అంశాలను ఉద్యానవన శాస్త్రవేత్త శెట్టి బిందు వివరించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బొడ్డు కల్యాణి సేంద్రియ ధ్రువపత్రం పొందే విధానం, రాయితీపై స్పైసెస్ బోర్డు అందించే ప్రోత్సాహకాల వివరాలను రైతులకు తెలియజేశారు.


