ప్రజా సమస్యలపై శాంతియుత ఉద్యమాలు
పాడేరు : వైఎస్సార్‌సీపీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలు చేస్తోందని వెఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రజాధనంతో నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉన్నత వైద్యానికి, వైద్య విద్యకు దూరంగా ఉన్న ఆదివాసీలకు ఓ వరంలా గత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రూ.500కోట్లతో వైద్య కళాశాల తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో పది చోట్ల వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ గత 16 నెలలుగా తమ పార్టీ ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వస్తోందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతోందన్నారు. వీటిని రాష్ట్ర గవర్నర్‌కు అందజేసి ప్రజల ఆకాంక్షను వివరిస్తామని చెప్పారు. దేవాలయాలాంటి వైద్య కళాశాల ప్రైవేటీకరణను ఎన్ని ఉద్యమాలు చేపట్టి అయినా అడ్డుకుని తీరుతామన్నారు. ప్రజా ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు కిముడు శివరత్నం, శెట్టి రోషిణి, వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, పాంగి పరశురాం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి రాంబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కూడా సుబ్రమణ్యం, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి కూతంగి సూరిబాబు, ఎస్టీ సెల్ జిల్లా మాజీ అద్యక్షుడు కమ్మిడి అశోక్, యువజన విభాగం నాయకులు రేగం చాణక్య, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, వనుగు బసవన్నదొర, గొల్లోరి నీలకంఠం, ఎంపీటీసీ దూసూరి సన్యాసిరావు, మాజీ సర్పంచ్‌లు పాంగి నాగరాజు, మినుముల కన్నాపాత్రుడు, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గల్లెల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై
28న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన
ప్రజల తరఫున నిలబడేది
వైఎస్సార్‌సీపీ మాత్రమే
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు
ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ


