
245 కిలోల గంజాయి పట్టివేత
● పట్టుకున్న గంజాయి విలువ
రూ.12.20 లక్షలు
● ఒకరు అరెస్టు, మరో ముగ్గురు పరార్
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద గురువారం అక్రమంగా తరలిస్తున్న 245 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. ఒడిశా రాష్ట్రం ముసిరిగూడ గ్రామం నుంచి పాడువకు ఆటోలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పక్క సమాచారం అందడంతో పోలీసులు కుజభంగి జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన వారు గంజాయి, ఆటోను వదిలి పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా.. ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఆటోను తనిఖీ చేయగా 245 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.12.20 లక్షలు ఉంటుందని, ముంచంగిపుట్టు మండలం కరిముఖిపుట్టు పంచాయతీ మెరకచింత గ్రామానికి చెందిన గోల్లోరి మహీంద్రా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని సీఐ శ్రీనివాసరావు ఎదుట హాజరుపర్చి కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా పాడువ బ్లాక్ అబరాడ గ్రామానికి చెందిన కిరసాని భూషణ్, మద్దిపుట్టు గ్రామానికి చెందిన నిలా కిముడు, మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు పంచాయతీ ముసిరిగూడ గ్రామానికి చెందిన సుకిరి దాము పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిందితుడు మహీంద్రా ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. విలాసావంతమైన జీవితం గడపాలన్న దురాశతో గంజాయి అక్రమ రవాణాలో దిగి పట్టుబడినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.