
బెర్రీ బోరర్‌తో కాఫీ రైతుకు తీవ్ర నష్టం
డుంబ్రిగుడ: బెర్రీ బోరర్ పురుగు వల్ల తీవ్రంగా నష్టపోయిన కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం వారు మండలంలోని కొర్రయి పంచాయతీ గత్తరజిల్లెడ గ్రామంలో బెర్రీ బోరర్ సోకిన కాఫీ తోటలను డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ పురుగు వల్ల జరిగిన నష్టాన్ని రైతుల నుంచి స్వయంగా తెలుసుకున్నామన్నారు. కాఫీలో ఎకరాకు రూ.లక్షకు పైబడి ఆదాయం వస్తుందన్నారు. బెర్రీబోరర్ వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు ఎటూ చాలదన్నారు. కిలో ఫలసాయానికి రూ.100, ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. కనీస మద్దతు ధర కల్పించి కాఫీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ శెట్టి రోషిణి, డుంబ్రిగుడ, అరకులోయ మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురామ్, స్వాభి రామ్మూర్తి, రేగం చాణక్య, గుంటసీమ, కొల్లాపుట్టు సర్పంచ్‌లు గుమ్మ నాగేశ్వరరావు, పి రామ్మూర్తి, ఉమ్మడి జిల్లాల ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజారమేష్, మండల కార్యదర్శి మఠం శంకర్ పాల్గొన్నారు.
అరకులోయ టౌన్: మండలంలోని పెదలబుడు పంచాయతీ గరడగుడలో బెర్రీబోరర్ సోకిన కాఫీ తోటలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పరిశీలించారు. బెర్రీ బోరర్ పురుగు వల్ల తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏమాత్రం చాలదని వారి వద్ద రైతులు వాపోయారు. కనీస మద్దతు ధర ప్రభుత్వం కల్పించేలా కృషి చేయాలని వారు విన్నవించుకున్నారు.
ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం
ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్