
గిరిజన హోంస్టేల ఏర్పాటుకు తక్షణ చర్యలు
● మేడ్ ఇన్ అరకు ఉత్పత్తుల విక్రయాలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : త్వరలో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్‌లో గిరిజన హోంస్టేల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పర్యాటక శాఖ అధికారులతో హోం స్టేల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో మేడ్ ఇన్ అరకు ఉత్పత్తులు విక్రయించటానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పర్యాటకులు గిరిజన గ్రామాల్లో రాత్రి బస చేసేందుకు అనువుగా ఉండే విధంగా హోం స్టేలను అభివృద్ధి చేయాలన్నారు.
అరకువ్యాలీ, లంబసింగి, మారేడుమిల్లి, పర్యాటక ప్రాంతాల్లో హోం స్టేలను ఏర్పాటు చేయాలని సూచించారు. అరకువ్యాలీ మండలంలో 91 హోం స్టేలు, చింతపల్లి మండలంలో 30 హోం స్టేలు గుర్తించారని తెలిపారు. టూరిజం కమిటీ సమావేశం నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించారు. చలి ఉత్సవాలకు ముందుగానే అరకు ఆర్ట్ ఫారంలను తయా రు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, క్యూరేటర్ డాక్టర్ శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.