
సికనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద ప్రత్యేక నిఘా
● 24 గంటలు సిబ్బంది గస్తీ
● డీఎఫ్‌వో వైవీ నర్సింహరావు
చింతపల్లి: పెదవలస రేంజ్ పరిధిలోని సికనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్టు డీఎఫ్‌వో వైవీ నర్సింహరావు తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సికనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసి 24 గంటలు గస్తీ ఏర్పాటు చేశామని తెలిపారు. సిగనాపల్లి అటవీ ప్రాంతంలో సుమారు కిలోమీటరు ఎత్తయిన కొండపై ఈ క్వారీ ఉండడంతో తమ సిబ్బంది దాడులు నిర్వహించడం కష్టంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 20 మంది సిబ్బందితో పహారా ఏర్పాటుచేశామన్నారు. క్వారీ సమీప గ్రామాల ప్రజలకు తవ్వకాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్వారీలో తవ్వకాలను ప్రోత్సహించి, వ్యాపారం చేసే వారి జాబితాను తయారు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. కొంతమందిని బైండోవర్ చేస్తామన్నారు. క్వారీ వద్ద దాడుల నిర్వహణకు పోలీసు, సీఆర్‌పీఎఫ్ బలగాలు అవసరమని ఏఎస్పీకి లేఖ రాశామన్నారు. క్వారీ పరిసరాలను పూర్తి నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్టు చెప్పారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఏ ఒక్కరు సంచరించినా కేసులు నమోదు చేస్తామన్నారు. గుర్రాలగొంది, మేడూరు, సత్యవరం, గురుగూడెం క్వారీ ప్రాంతాల్లో సిబ్బందితో నిఘా ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు.