
ప్రయాణం.. భయం భయం
● అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి
● గోతులతో ప్రయాణికులు సతమతం
● నిలిచిపోయిన పనులు
● పట్టించుకోని అధికారులు
సీలేరు: పర్యాటక కేంద్రంతో పాటు జలవిద్యుత్ కేంద్రాలతో ఎంతో పేరొందింది సీలేరు... ప్రకృతి అందాలకు నిలయంగా మారింది. వేలాది పర్యాటకులతో నిత్యం ఈ ప్రాంతం కిటకిటలాడుతోంది.. జాలువారుతున్న జలపాతాలు, పచ్చని అడవులు..ఆహ్లాదకరమైన వాతావరణం.. దట్టమైన అడమి మార్గం మీదుగా సాగే అంతర్రాష్ర్ట్ర రహదారి ప్రయాణం అందరికీ ఓ మధురానుభూతిగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం దుర్భరంగా మారింది. పెద్ద పెద్ద గోతులతో, రాళ్లు తేలిన ఈ రహదారి దారుణంగా ఉంది. అడుగుకొక గొయ్యితో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడ ఆర్.వి.నగర్ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న 80 కిలోమీటర్ల రహదారి పూర్తిగా ధ్వంసమైంది.పెద్ద పెద్ద గోతులతో రాకపోకలకు అంతరాయం మారింది.
గోతులమయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో గోతులు లేని రహదారులు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. నేటికీ ఏడాది పైబడినా నేటి వరకు కూటమి ప్రభుత్వం మన్య ప్రాంతంపై దృష్టి సారించలేదు. సీలేరు మీదుగా సాగే అంతర్రాష్ట్ర రహదారిపై ఒక్క గోతును కూడా పూడ్చలేదని పలువురు స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు వినతులిచ్చాన ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. మన రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులు సీలేరు మీదుగా విశాఖపట్నం, అరకు, రాజమండ్రి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. రోజుకు వందల్లో వాహనాలు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. గోతులమయంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణానికి ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ ప్రాంతంలో విపత్తు వచ్చి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. నెల రోజులు రాకపోకలు స్తంభించాయి. అప్పట్లో గిరిజన మంత్రి ఇక్కడ పర్యటించి, తక్షణమే సీలేరు రోడ్డు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నేటికీ ఏడాదైన పనులు ప్రారంభించలేదు.
అధికారుల నిర్లక్ష్యం
సీలేరు రోడ్డుకి రూ.22 కోట్లు మంజూరైనట్టు ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్.వి.నగర్ నుంచి పాలగెడ్డ వరకు నాలుగు టెండర్లు కేటాయించారు. అందులో దారాలమ్మ తల్లి గుడి నుంచి చల్లని శిల్ప వరకు రూ.6 కోట్లతో పనులు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేసినట్టు పలువురు చెబుతున్నారు. పనుల్లో జరుగుతున్న జాప్యం..మిగిలిన నిధులు తదితర విషయాలపై ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు పలుమార్లు అధికారులను ప్రశ్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వలన ఏడాదైనా పనులు జరగడం లేదంటున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల గత్యంతరం లేక అధ్వానంగా ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ప్రారంభిస్తాం
ఆర్.వి.నగర్ నుంచి పాలుగడ్డ వరకు రహదారిలో పాడైన చోట్ల పనులు త్వరలో ప్రారంభిస్తామని, ఇందుకు రెండు రోజుల్లో సర్వే చేస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందర్ బాబు చెప్పారు. రహదారి నిర్మాణానికి మంజూరైన నిధులతోనే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ప్రయాణం దారుణం
సీలేరు నుంచి ఆర్.వి.నగర్ వరుకు ఉన్న రహదారిపై ప్రయాణం చేయలేకపోతున్నాం. పెద్ద పెద్ద గోతులతో నిండి ఉన్న ఈ దారిపై ప్రయాణం దారుణంగా మారింది. బస్సులో కూర్చొని ప్రయాణం చేయలేకపోతున్నాం. ప్రయాణం అనంతరం ఒళ్లంతా నొప్పులతో సతమతమవుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి రహదారి కష్టాలు తీర్చాలి. సీలేరు ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయాలి.
– బుజ్జి, వైఎస్సార్‌సీపీ నాయకుడు, సీలేరు
పనుల్లో జాప్యం ఎందుకు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోతులు లేని రోడ్లు చేస్తామని ప్రకటనలు గుప్పించింది. ఏడాదైనా ఒక్క అభివృద్ధి పనిచేయలేదు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్రాంతంలో భారీ విపత్తుతో రోడ్డు కోతకు గురైంది. రోడ్డు కోసం రూ.23 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు అఽధికారి ప్రకటించారు.ఏడాదైనా ఒక్క గోయ్యిని పూడ్చలేదు. నిధులు ఏమయ్యాయో, పనుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలి.
– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరు
త్వరగా రోడ్డు నిర్మించాలి
ప్రభుత్వం తక్షణమే స్పందించి సీలేరు మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని బాగు చేయాలి.లేనిపక్షంలో గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ఇప్పటివరకు రహదారుల్లో కనీసం గోతులు కూడా పూడ్చలేదు. ఈ మార్గంలో ప్రయాణానికి రోగులు, గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు.
– కారే శ్రీనివాసు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు

ప్రయాణం.. భయం భయం

ప్రయాణం.. భయం భయం

ప్రయాణం.. భయం భయం