
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు శస్త్ర చికిత్సలు
చింతపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఏడాదిన్నర తరువాత మళ్లీ గర్భిణులకు శస్త్రచికిత్సలు నిర్వహించడం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆస్పత్రిలో గర్భిణులకు సిజేరియన్‌లను అప్పటి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు, సీ్త్ర వైద్యనిపుణులు డాక్టర్ నర్సింగరావు ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రారంభించారు. ఈ సిజేరియన్లు ఆరు నెలల పాటు కొనసాగాయి.అనంతరం వైద్యనిణులు బదిలీపై వెళ్లి పోవడంతో పూర్తిగా నిలచిపోయాయి.దీంతో ప్రసవానికి ఇబ్బందులు తలెత్తితే 50,60 కిలో మీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి,పాడేరు జిల్లా ఆస్పత్రికి గర్భిణులను తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో సీ్త్రవైద్య నిపుణులతో పాటు మత్తువైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. దీంతో పాటు ఇటీవలే ఆపరేషన్ థియేటర్‌ను అన్ని సౌకర్యాలతో ఆధునికీకరించారు.ఈ నేపథ్యంలో బుధవారం మండలంలో చౌడుపల్లి పంచాయతీ పరిధి బైలుకించంగి(రత్నగిరి కాలనీ)కి చెందిన కుడుములు ఝాన్సీరాణి ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. కాన్పు కష్టతరంగా మారి, ఆమెకు శస్త్ర చికిత్స అవసరమైంది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి ఆధ్వర్యంలో సీ్త్ర వైద్యనిపుణులు వాసవి,శ్రీలత,మత్తు వైద్య నిపుణులు సాహితీలు శస్త్రచికిత్స చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. ఇకపై చెవి,ముక్కు,గొంతుతో పాటు ఎముకలకు సంబంధించిన శస్త్ర చికిత్సలను కూడా ఆస్పత్రిలోనే నిర్వహించనున్నట్టు సూపరింటెండెంట్ నీలవేణి తెలిపారు. ఆస్పత్రిలో గర్భిణులకు మళ్లీ శస్త్ర చికిత్సలు ప్రారంభించడంతో మైదాన ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తప్పాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.