
సెక్యూరిటీ నో..!
జెన్ కో..
మోతుగూడెంలో అసిస్టెంట్
సెక్యూరిటీ అధికారి కార్యాలయం
సీలేరు కాంప్లెక్స్‌లో రక్షణ వ్యవస్థపై పర్యవేక్షణ కరువు
మోతుగూడెం: సీలేరు కాంప్లెక్స్‌లో కీలకమైన అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పోస్టు గత 20 నెలలుగా ఖాళీగా ఉంది. పొల్లూరులో ఏపీ జెన్‌కో సెంట్రల్ స్టోర్‌కు ఏటా వివిధ కంపెనీల నుంచి రూ.కోట్ల విలువైన విడి పరికరాలు సరఫరా జరుగుతుంది. ఇక్కడి నుంచి మాచ్‌ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు వీటిని పంపిస్తుంటారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి రూ.కోట్ల విలువైన యంత్ర పరికరాలు ఇదే స్టోర్‌లో భద్రపరుస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించి పలు విభాగాల అధికారులు ఈ స్టోర్ నుంచి విడి పార్టులను తీసుకువెళ్తుంటారు.
● పొల్లూరు, డొంకరాయి, సీలేరు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పొల్లూరులో ఉన్న హెవీ ట్రాన్స్‌పోర్ట్ (హెచ్‌టీ) స్టోర్స్‌లో పాత యంత్రాలు ఉన్నాయి. పొల్లూరు ఐదు, ఆరు యూనిట్లలో ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సిమెంటు, ఐరన్‌తో పాటు ఇతర సివిల్ పనులకు సంబంధించిన రూ.కోట్ల విలువైన మెటీరియల్ పొల్లూరు చెక్‌పోస్టు నుంచి పవర్ హౌస్‌కు వెళ్తుంది. ఎంతో కీలకమైన ఈ వ్యవస్థలను అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి కీలకమైన పోస్టును భర్తీ చేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు కొంతకాలంగా లేఖలు రాసినా ఏపీ జెన్‌కో నుంచి స్పందన లేదు.
సిబ్బంది ఉద్యోగ విరమణతో..
ఏపీ జెన్‌కోకు సొంత సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన సిబ్బంది 2019లో రిటైర్ కావడంతో ఏపీ జెన్‌కో యాజమాన్యం రాష్ట్రవాప్తంగా సుమారు 60 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. వీరిలో 13 మందిని సీలేరు కాంప్లెక్స్‌లో జలవిద్యుత్ కేంద్రాలకు శాశ్వత ప్రాతిపదికన కేటాయించింది. ఎటూ చాలకపోవడంతో మాజీ సైనికోద్యోగులు 13 మందిని నియమించి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి ఏడుగురు, డొంకరాయికి నలుగురు, అప్పర్ సీలేరుకు ముగ్గురిని కేటాయించింది. ఈ మూడు జలవిద్యుత్ కేంద్రాలకు కీలకమైన డీఎస్పీ క్యాడర్ స్థాయి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టును హెడ్ కానిస్టేబుల్ స్థాయి వారిని ఇన్‌చార్జిగా నియమించి చేతులు దులుపుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రాల ఆస్తుల పరిరక్షణలో ఎంతో కీలకమైన అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టును శాశ్వత ప్రాతిపదికన నియమించడమే కాకుండా మోతుగూడెంలో ఏపీ జెన్‌కో చెక్‌పోస్టును పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. వీళ్లే కాకుండా కాకినాడ జిల్లాతో పాటు పాడేరు నుంచి ఈ మూడు జల విద్యుత్ కేంద్రాలకు పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై 42 మంది హోంగార్డులను రక్షణకు ఉపయోగిస్తున్నారు.
ఏటా జలవిద్యుత్ కేంద్రాల ద్వారా రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న ఏపీ జెన్‌కో యాజమాన్యం కీలకమైన సెక్యూరిటీ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీలేరు జలవిద్యుత్ కాంప్లెక్సులో కీలకమైన అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకపోవడం, మోతుగూడెంలో చెక్‌పోస్టును పునరుద్ధరించకపోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
శాశ్వత ప్రాతిపదికన భర్తీకాని
అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పోస్టు
స్థాయిలేని సిబ్బందితో నిర్వహణ
లేఖలు రాసినా పట్టించుకోని
ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు
మోతుగూడెంలో చెక్‌పోస్టును
పునరుద్ధరించని యంత్రాంగం

సెక్యూరిటీ నో..!

సెక్యూరిటీ నో..!