
మావోయిస్టు లొంగుబాటు
వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్‌బర్దర్
పాడేరు: ఏసీఎం క్యాడర్‌కు చెందిన ఓ మావోయిస్టు ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన ఏరియా కమిటీ సభ్యుడు దిరిదో దేవ (34) అనే మావోయిస్టు 2011లో (14వ ఏట) మావోయిస్టు పార్టీలో చేరాడు. అంచెంలంచెలుగా ఎదుగుతూ ఏసీఎం క్యాడర్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో శిక్షకునిగా పని చేస్తూ కొంటా ఏరియా కమిటీ సబ్యుడిగా కొనసాగుతున్నాడు. గెరిల్లా యుద్ధంలో నిష్ణాతుడని ఎస్పీ తెలిపారు. రెండు హత్య ఘటనలు, 13 ఎదురు కాల్పుల ఘటనల్లో పాల్గొన్నట్టు ఆయన వివరించారు. ఇటీవల కాలంలో మావోయిస్టు సిద్ధాంతాలు విసుగు చెందాడు. పార్టీకి ఆదరణ లేకపోవడం, ప్రజల్లో పార్టీ పూర్తిగా పట్టు కోల్పోవడం, ఇటీవల కాలంలో తన తమ్ముడు బైక్ ప్రమాదంలో మృతి చెందడం, తదితర కారణాలతో లొంగిపోయినట్టు ఎస్పీ వివరించారు. అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి అనుకుంటే నేరుగా పోలీసు శాఖను సంప్రదించాలని ఆయన కోరారు.