
సమస్యలపై కలెక్టర్‌కు వినతులు
రంపచోడవరం: ఏజెన్సీలో అక్రమ కట్టడాల నిర్మాణాలను అరికట్టాలను కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మంగళవారం రంపచోడవరంలో కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజనేతరులకు జారీ చేసిన విద్యుత్ మీటర్లను స్వాధీనం చేసుకోవాలన్నారు. అక్రమ కట్టడాలు తొలగించిన చోట గిరిజనేతరులు గుడారాలు వేసి వ్యాపారాలు చేస్తున్నారని వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ చట్టాలకు లోబడి పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ను కలిసి వారిలో ప్రసాద్ కడబాల కాసులమ్మ, తీగల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: మండలంలోని కిర్రాబు వద్ద చిన్నేరుపై ఆనకట్ట నిర్మించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు బాలకృష్ణ, సూరిబాబు, నాగరాజు తదితరులు రాజవొమ్మంగి వచ్చిన కలెక్టర్ దినేష్‌కుమార్‌ను మర్యాదగా కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఐటీడీఏ పీవోగా దినేష్‌కుమార్ ఉండేవారని గుర్తు చేశారు. చాలా కాలంగా కిర్రాబులో చిన్నేరుపై ఆనకట్ట లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడ ఆనకట్ట నిర్మాణంతో ఐదు పంచాయతీల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని వినతిలో తెలిపారు. చిన్నేరు ద్వారా విలువైన జలాలు దిగువకు వృథాగా పోతున్నాయని వాటిని, సాగు భూములకు అందేలా చూడాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆనకట్ట కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చినట్టు ఆదివాసీ సంఘం నాయకులు తెలిపారు.

సమస్యలపై కలెక్టర్‌కు వినతులు