
రహదారి కోసం ఎమ్మెల్యేకు వినతి
చింతపల్లి: మండలంలో లోతుగెడ్డ వంతెన నుంచి కోరుకొండ వరకూ పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని బలపం సర్పంచ్ కొర్రా రమేష్‌నాయుడు కోరారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ నాయకులు మర్యాదగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా లోతుగెడ్డ వంతెన నుంచి మూలకోత్తూరు వరకూ ఉన్న రోడ్డు దెబ్బతిందని, గోతులతో నిండి ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. బలపం పంచాయితీతో పాటు లోతుగెడ్డ, కుడుముసారి పంచాయతీల్లో సుమారు 60 గ్రామాలకు ఈ రహదారే ప్రధానం ఉందన్నారు. చినుకు పడితే ఈ రహదారి మీదుగా రాకపోకలకు నానా అవస్థలు పడాల్సి వస్తోందని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు వారు తెలిపారు. గెమ్మిలి మోహన్‌రావు, కోటిబాబు, బాలకృష్ణ, శ్రీనివాసరావు, బుజ్జిబాబు, నీలకంఠం తదితరలు పాల్గొన్నారు.