
తెరుచుకోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రం
యూరియా, రాజ్‌మా విత్తనాల కోసం రైతుల పడిగాపులు ఎవరూ రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన రైతులు
పాడేరు: మండలంలోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రం వద్ద గిరిజన రైతులు యూరియా, రాజ్‌మా చిక్కుళ్ల విత్తనాల కోసం పడిగాపులు కాశారు. సోమవారం పాడేరు, హుకుంపేట మండలాల నుంచి రైతులు ఉదయం 9 గంటలకు ఈ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రైతు సేవా కేంద్రం తెరవలేదు. అగ్రికల్చర్ అసిస్టెంట్ కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న పాత పాడేరు రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడికి వచ్చారు. సిబ్బంది ఎవరూ లేరని, రైతు సదస్సు కోసం ఇరడాపల్లి వెళ్లారని, పైగా స్టాక్ కూడా అందుబాటులో లేదని ఆమె చెప్పారు. దీంతో రైతులు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 కి.మీ. నుంచి యూరియా కోసం వచ్చాను
నేను ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి, రాజ్‌మా సాగు చేస్తున్నాను. యూరియా అవసరమై హుకుంపేట మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో తిరిగాను. ఎక్కడకు వెళ్లినా స్టాక్ లేదన్నారు. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రంలో యూరియా ఉందనే సమాచారంతో వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలైనా రైతు సేవా కేంద్రం తెరవలేదు. పైగా ఇక్కడ కూడా స్టాక్ లేదంటున్నారు.
–పాంగి సుబ్బారావు, బంగారుబుడ్డి గ్రామం, జర్రకొండ గ్రామం, హుకుంపేట మండలం
రాజ్‌మా చిక్కుళ్ల కోసం రెండుసార్లు తిరిగాను
సబ్సిడీపై రాజ్‌మా చిక్కుళ్ల కోసం రైతు సేవా కేంద్రానికి రెండుసార్లు తిరిగాను. మొదటిసారి విత్తనాలు రాలేదన్నారు. దీంతో సోమవారం మళ్లీ సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రానికి వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలైనా రైతు సేవా కేంద్రం తెరవలేదు. చివరిగా విత్తనాలు ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి సబ్సిడీపై రాజ్‌మా విత్తనాలు అందేలా చూడాలి.
–వంతాల సావిత్రమ్మ, గిరిజన రైతు, లోచలిపుట్టు గ్రామం, పాడేరు మండలం

తెరుచుకోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రం

తెరుచుకోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రం