ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నాం
రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో లేదు. దీంతో ఒడిశాలోని మల్కన్‌గిరి, చిత్రకొండ ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయాధికారి, సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది.
–ఇంతెంగి చిట్టిబాబు, రైతు, గుంజివాడ, జామిగుడ పంచాయతీ పెదబయలు మండలం
సాక్షి, పాడేరు/అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి గిరి రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎరువులు దొరక్క పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని వారు ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలోని 352 గ్రామ సచివాలయాల పరిధిలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వీటిలో పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామనే నెపంతో వీటిలో కొన్నింటికి మాత్రమే యూరియా సరఫరా చేసి, మిగతా వాటిని నిలిపివేసింది. జిల్లాలోని ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించింది. దీనిని ఆసరాగా తీసుకుని ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అందినంత దోచుకుంటున్నారు.
కాకి లెక్కలు..
జిల్లాలో 56 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. వీటిలో 30 శాతం ప్రకృతి విధానంలో సాగు చేస్తుండగా, మిగిలిన 70 శాతం పైరుకు సుమారు వెయ్యి టన్నుల వరకు యూరియా అవసరం. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ యూరియా అమ్మకాలను ప్రైవేట్ డీలర్లకు అప్పగించింది. వారు ఇప్పటివరకు సుమారు 400 టన్నులు విక్రయించినట్టు చెబుతున్నా.. రైతులకు అందింది తక్కువేనన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అధిక ధరలకు విక్రయించారన్న ఆరోపణలు లేకపోలేదు.
● యూరియాను రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అరకొరగా యూరియాను రెండు రోజుల నుంచి అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు రెండు వేల ట న్నుల వరకు యూరియా అవసరం ఉంది. అయితే జిల్లాలోని 14 మండలాల పరిధిలో కేవలం 22 రైతు సేవా కేంద్రాలతోపాటు అరకులోయ, చింతపల్లి, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం, ఎటపాక మండలాల్లోని ఆరు ప్రైవేట్ డీలర్ల వద్ద 365 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఇవి ఎటూ చాలకపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
● మండలానికి రెండు, మూడు రైతు సేవా కేంద్రాలకే యూరియా సరఫరాను పరిమితం చేయడంతో ప్రభుత్వం తీరు పట్ల మిగతా ప్రాంత రైతులు కుతకుతలాడుతున్నారు.
అందుబాటులో లేక గిరి రైతుల ఇబ్బందులు ప్రకృతి వ్యవసాయం సాకుతో తగ్గించిన సరఫరా
రైతు సేవా కేంద్రాల్లో అరకొరగా పంపిణీ
మరోపక్క ప్రైవేట్ డీలర్ల దోపిడీ
ఒడిశా నుంచి అధిక ధరలకు తెచ్చుకుంటున్న సరిహద్దు ప్రాంతాల రైతులు
సగానికి పైగా కొరత
జిల్లాలో వరి, ఉద్యానవన పంటలు సుమారు 3 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. వీటికి సుమారు 5,200 టన్నుల యూరియా అవసరం. ఇప్పటి వరకు ప్రభుత్వం డీలర్లు, వ్యవసాయ పరిపతి సంఘాలు, 16 రైతు సేవా కేంద్రాల ద్వారా కేవలం 2,664 టన్నుల యూరియా మాత్రమే పంపిణీ చేశారు.