
రత్నంపేట వంతెన పై వరద నీటి ఉధృతి
ఐదు పంచాయతీలకు నిలిచిన రాకపోకలు
కొయ్యూరు: పాడైన రత్నంపేట వంతెన నుంచి వరదనీరు ప్రవహించడంతో మండలంలోని ఐదు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కురిసిన వర్షానికి కాలువ ఉధృతంగా ప్రవహించింది. పాడి–రత్నంపేట మధ్య వంతెన పూర్తిగా పాడైంది. వంతెన శ్లాబ్ సగానికిపైగా పోయింది. దీంతో వరద నీటిని దాటుకుని రావడం కష్టంగా మారింది. తాజాగా సోమవారం కురిసిన వర్షానికి కాలువ ఉధృతంగా రావడంతో రెండు వైపుల రాకపోకలు ఆగాయి. వివిధ పనుల కోసం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు బాలారం, కంఠారం, బకులూరు, ఆడాకుల పంచాయతీలకు చెందిన వారు వెళతారు. సోమవారం కృష్ణాదేవిపేట సంత కావడంతో ఎక్కువమంది వచ్చారు. తీరా మధ్యాహ్నానికి వరదనీరు పోటెత్తడంతో రాకపోకలు ఆగాయి. పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నామని, వినతులు ఇచ్చినా స్పందన రావడం లేదన్నారు.