
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ
పాడేరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, పాడేరు, అరకు మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్‌కు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఏజెన్సీలో గిరిజన రైతులకు ఎక్కడ కూడా యూరియా, ఎరువులు సరఫరా చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉండి వారి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వేలాదిగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సబ్జిడీపై విత్తనాలతో పాటు యూరియా, ఎరువులను సక్రమంగా సరఫరా చేసిందన్నారు. అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ రైతులంటే చంద్రబాబుకు ఏ మాత్రం కూడా గిట్టదన్నారు. వారి బాగు కోసం ఆయన ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటూ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పాడేరు, జి. మాడుగుల మండల అద్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, సోమెలి లక్ష్మణరావు, వనుగు బసవన్నదొర, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం జిల్లా ప్రతినిధులు కూడా సుబ్రమణ్యం, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ప్రతినిధి మోదా బాబూరావు పాల్గొన్నారు.
కూటమి దగాకోరు విధానాలపై ఈనెల 9న పాడేరులో అన్నదాత పోరు
విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,
రేగం మత్స్యలింగం పిలుపు
పోస్టర్ల ఆవిష్కరణ