
2,83,907 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు
అరకులోయ టౌన్: జిల్లాలో 2,83,907 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం అరకులోయ స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్‌తో కలిసి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకు రేషన్ సరకులు పంపిణీ చేస్తామన్నారు. కాఫీలో బెర్రీబోరర్ సోకిన పిందెలు, ఫలసాయాన్ని పూడ్చిపెట్టేందుకు, ఇతర ప్రయోజనాల నిమిత్తం ఎకరాకు రూ.5వేలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కిలో కాఫీకి రూ.50 నష్టపరిహారం ఇస్తామన్నారు. చినలబుడు పంచాయతీ పకనకుడిలో బెర్రీ బోరర్ ఆశించిన కాఫీ తోటలను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ ప్రాంతంలో 80 ఎకరాల్లో కాఫీ తోటలకు బెర్రీబోరర్ ఆశించిందన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డులు సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానమై ఉన్నందున దుర్వినియోగం చేసే అవకాశం లేదన్నారు. కార్డులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఏ రోజు ఎక్కడ రేషన్ పొందారనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, సహాయ కలెక్టర్ సాహిత్, కాఫీ బోర్డు డీడీ రమేష్, డ్వామా ప్రాజెక్టు అధికారి డాక్టర్ విద్యాసాగర్, తహసీల్దార్ కె. కుమార స్వామి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, వ్యవసాయ, ఉద్యాన, కాఫీ బోర్డు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ, మహిళా శిశు
సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి