
కాఫీ రైతుల సహకారంతో బెర్రీబోరర్ నిర్మూలన
అరకులోయ టౌన్: రైతుల సహకారంతో కాఫీతోటల్లో బెర్రీ బోరర్‌ను నిర్మూలించవచ్చని డ్వామా ప్రాజెక్టు అధికారి డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం మండలంలోని చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో బెర్రీబోరర్ బాధిత రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చినలబుడు పంచాయతీ పరిధి పకనకుడిలో 29 ఎకరాలు, మాలివలసలో 29, మాలిశింగారంలో 7, చినలబుడులో 5, తురాయిగుడలో 2 ఎకరాల్లో బెర్రీ బోరర్ (కాయతొలుచుపురుగు) సోకిందన్నారు. కాఫీ ఫీల్డ్ పంక్షనరీ సూచనల మేరకు కాఫీ బోర్డ్ ద్వారా కిలో కాఫీకి రూ. 50 నష్ట పరిహారం అందిస్తామన్నారు. బెర్రీబోరర్ పురుగు ఆశించిన కాఫీ పంటను తొలగించి వేడి నీటిలో ఉడకబెట్టి దానిని మట్టిలో పాతి పెట్టాలని సూచించారు. పూడ్చి పెట్టడం తదితర ప్రక్రియకు సంబంధించి ఎకరానికి రూ. 5వేలు చెల్లిస్తామన్నారు. కాఫీ బోర్డు ఏడీ లకే బొంజుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు పాల్గొన్నారు.
వేడి నీటిలో ఉడకబెట్టి పూడ్చివేత
చింతపల్లి: బెర్రీబోరర్ ఆశించిన కాఫీ తోటలో ఫలసాయాన్ని తొలగిస్తున్నట్టు స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శెట్టి బిందు తెలిపారు. పరిశోధన స్థానం కాఫీ తోటలో బెర్రీబోరర్ సోకిన పంటను ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం జూనియర్ లైజన్ ఆఫీసర్ నాగేశ్వరరావు సూచనల మేరకు శుక్రవారం తొలగించామని ఆమె తెలిపారు. కోసిన పంటను వేడినీటిలో ఉడకబెట్టిన అనంతరం 50 సెంటీమీటర్ల గోతులు తవ్వి పూడ్చిపెట్టామని ఆమె వివరించారు.

కాఫీ రైతుల సహకారంతో బెర్రీబోరర్ నిర్మూలన