
పది వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అన్యాయం
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం, వైద్యవిద్య లక్ష్యంగా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణకు అమోదం తెలపడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ మొదటి దశలో పులివెందుల, మార్కాపురం, ఆదోని, రెండవ విడతలో పార్వతీపురం, పాలకొల్లు, అమలాపురం, మాకవరపాలెం తదితర పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ క్యాబినెట్‌లో తీర్మానం చేయడం సమంజసం కాదన్నారు. పేదలకు వైద్యంతో పాటు వైద్యవిద్యను దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేదల వైద్యం లక్ష్యంగా వైద్య కళాశాలల ఏర్పాటుతో గత వైఎస్సార్‌సీపీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. వైద్యం, వైద్యవిద్యను ప్రైవేట్‌పరం చేస్తే పేదలంతా దోపిడీకి గురవుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని కూడా నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ.5వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదన్నారు. పేద ప్రజల వైద్యం, వైద్య విద్యకు విఘాతం కలిగించే చర్యలను కూటమి ప్రభుత్వం వీడాలని ఆమె డిమాండ్ చేశారు.
పేదలకు వైద్యం, వైద్యవిద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు
కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ధ్వజం