పేదోడి గుండెకోత | - | Sakshi
Sakshi News home page

పేదోడి గుండెకోత

Jul 20 2025 6:01 AM | Updated on Jul 21 2025 5:25 AM

పేదోడ

పేదోడి గుండెకోత

● ‘ఉత్తరాంధ్ర గుండె’కు పెద్ద దిక్కు కేజీహెచ్‌ ● ఆరేడు నెలలుగా నిలిచిపోయిన హార్ట్‌ ఆపరేషన్లు ● మూలకు చేరిన శస్త్రచికిత్స చేసే పరికరాలు ● నిస్సహాయంగా నిరుపేద రోగులు

డాబాగార్డెన్స్‌: గుండె ఆపరేషన్‌ చేస్తే తన భర్త బతుకుతాడని డాక్టర్లను వేడుకున్న ఆ భార్యకు నిరాశ ఎదురైంది. ‘ఇక్కడ ఆపరేషన్లు నిలిచిపోయాయి’అనే జవాబు తప్ప వారికి ఎటువంటి భరోసా లభించలేదు. ఇది ఒక్కరి కథ కాదు. గుండె చికిత్సల కోసం కేజీహెచ్‌కు వచ్చే ఎందరో నిరుపేదల వ్యథ. ఒకప్పుడు వేలాది గుండెలకు ప్రాణం పోసిన కేజీహెచ్‌ కార్డియాలజీ విభాగానికి నేడు జబ్బు చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, అత్యవసర శస్త్రచికిత్స యంత్రాలు మూలకు చేరడంతో పేదల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే స్థోమత లేని నిరుపేదలు ప్రాణాలు వదిలేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల పేదలకు గుండె జబ్బులొస్తే ఒకే ఒక్క భరోసా కేజీహెచ్‌. ఇక్కడ కార్డియాలజీ సూపర్‌ స్పెషాలిటీ విభాగం ఉంది. నెలకు దాదాపు 40కి పైగా అత్యంత క్లిష్టమైన బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ మార్పిడులు వంటివి చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘనత ఈ ఆసుపత్రిది. కానీ గడిచిన ఆరేడు నెలలుగా శస్త్రచికిత్సలు జరగడం లేదు. గుండె ఆపరేషన్లకు కీలకమైన హార్ట్‌–లంగ్‌ మిషన్‌, టెంపరేచర్‌ కంట్రోల్‌ మిషన్లు గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నాయి. వాటి కాలం చెల్లి, తుప్పుపట్టగా.. ఆరేడు నెలల కిందట వరకు మరమ్మతులు చేయిస్తూ వైద్య సేవలందించారు. కనీసం మరమ్మతు చేయడానికి కూడా అవి పనికి రాని విధంగా తయారవడంతో గత డిసెంబర్‌ నెలాఖరు నుంచి మూలన పడ్డాయి. దీంతో జనవరి నుంచి తీవ్ర గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రెండు మిషన్లు మూలకు చేరడంతో రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

కార్పొరేట్‌ కాసుల వేటలో పేదల బలి

కేజీహెచ్‌లో ఆపరేషన్లు ఆగిపోవడమే అదనుగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు కాసుల వేట మొదలుపెట్టాయి. ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదనే సాకుతో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు నిలువుదోపిడీ చేస్తున్నాయి. అప్పు చేసి ఆపరేషన్‌ చేయించుకోలేని నిరుపేదలు, విధిరాతకు తలొంచి ప్రాణాలు వదులుకుంటున్నారు. కేజీహెచ్‌కి వస్తే రూపాయి ఖర్చు లేకుండా బతికి బయటపడతామనుకున్న వారికి లక్షలు పోస్తేనే ప్రాణం నిలుస్తుందన్న నిజం గుండెల్ని పిండేస్తోంది.

ఆగస్టు ఒకటి నుంచి శస్త్రచికిత్సలు

గుండె శస్త్రచికిత్సలకు సంబంధించి పరికరాలు మూలకు చేరిన విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ప్రజా ప్రతినిధులకు కూడా సమస్యను వివరించాం. వారి నిధుల నుంచైనా ఇస్తారేమోనని.! అలాగే సీఎస్సార్‌ కింద పరికరాలు సమకూర్చాలని పరిశ్రమలు, దాతలు, బ్యాంకులకు విన్నవించాం. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన తీసుకునే అవకాశం ఉంది. ఆగస్టు ఒకటి నుంచి శస్త్ర చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

– ఐ.వాణి, సూపరింటెండెంట్‌, కేజీహెచ్‌

పేదల ప్రాణాలంటే చులకనా?

మూలనపడిన ఆ రెండు యంత్రాల ఖరీదు కేవలం రూ. 2.3 కోట్లు ఉంటుందని అంచనా.. ప్రభుత్వానికి ఇది పెద్ద మొత్తం కాదు. కనీసం సీఎస్సార్‌ నిధుల ద్వారానైనా కొనుగోలు చేద్దామన్న ప్రతిపాదనలు తీసుకొచ్చినా కార్యరూపం దాల్చలేదు. నెలకు రూ.1.50 లక్షల అద్దెకు తెచ్చుకుందామంటే రూ.25 లక్షల డిపాజిట్‌ కట్టాలన్న నిబంధనకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. అధికారుల లెక్కల్లో ఆ డిపాజిట్‌ మొత్తం పెద్దదిగా కనిపించిందేమో కానీ, ప్రాణాల ముందు దాని విలువెంత? కోట్ల రూపాయల పరికరాల కంటే పేదల ప్రాణాలు అంత చౌకగా మారాయా? అనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత వార్డుల్లో రోగులకు సాధారణ చికిత్సలు మాత్రమే అందిస్తున్నారు. అత్యవసరమైతే బయట చూపించుకోవాలని సూచిస్తున్నారు. యంత్రాలు పనిచేయకపోతే వైద్యులు మాత్రం ఏం చేయగలరు? చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి తక్షణమే ఆ యంత్రాలను సమకూర్చాలని రోగులు కోరుతున్నారు.

పేదోడి గుండెకోత1
1/2

పేదోడి గుండెకోత

పేదోడి గుండెకోత2
2/2

పేదోడి గుండెకోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement