
ప్రారంభోత్సవం సరే... సిబ్బంది ఏరీ?
బీచ్‌రోడ్డు: కూటమి ప్రభుత్వంలో ప్రచార యావ తప్ప, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ధ్యాస కనిపించట్లేదు. ఇందుకు ఉదాహరణే ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్(అకడమిక్) భవనం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విలేజ్ క్లినిక్స్ నుంచి రాష్ట్ర స్థాయి ఆస్పత్రిల వరకు బలోపేతం చేశారు. అందులో భాగంగానే పెదవాల్తేరులోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో నూతన విభాగాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.28.60 కోట్లు వెచ్చించి అకడమిక్ విభాగాన్ని పూర్తి వసతులతో నిర్మించారు. ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎట్టకేలకు మంగళవారం ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. అయితే సిబ్బందిని మాత్రం ఇంకా కేటాయించలేదు. సిబ్బంది లేకుండానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీటిని ప్రారంభించనుండటం గమనార్హం. ప్రారంభోత్సవానికి ఏడాది కాలం తీసుకున్న కూటమి ప్రభుత్వం, సిబ్బంది నియామకానికి ఇంకెంత సమయం తీసుకుంటుందో చూడాలి.
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ భవనం ప్రారంభం నేడు
సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. దీంతో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక విభాగాలతోపాటు, డి–అడిక్షన్ సెంటర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.