
గంజాయి రహిత మన్యం అందరి లక్ష్యం
పాడేరు: గంజాయి మహమ్మారిని మన్యం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాల్సిన బాధ్యత నేటి ఆదివాసీ యువతపై ఉందని పాడేరు సిఐ ధీనబంధు అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో సోమవారం స్థానిక కాఫీ హౌస్‌లో ఆదివాసీ విద్యార్ధిని మేలు కొలుపుదాం–బంగారు భవిష్యత్‌కు పునాదులు వేద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ధీనబంధు మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించటానికి, పోటీ పరీక్షల్లో సన్నద్ధమయ్యేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి రహిత మన్యం అందరి లక్ష్యంగా పనిచేయాలన్నారు. కళాశాలల్లో, వసతి గృహాల్లో ఎక్కడైన గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి బారిన పడి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్‌శర్మ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల గంజాయి స్మగ్లర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలన్నారు. ఆదివాసీల మధ్య ఐక్యను దెబ్బతీసేందుకు చాలామంది కుట్రపూరితంగా వ్యవహారించే అవకాశం ఉందన్నారు. అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆదివాసీ నిరుద్యోగ యువత కోసం ఐటీడీఏ స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం ప్రతినిధులు ధర్మన్న పడాల్, బాల్‌దేవ్, కార్తిక్, జీవన్, విద్యార్ధులు పాల్గొన్నారు.