
ఘనంగా రాజరాజేశ్వరి శాకంబరి ఉత్సవం
శివనామస్మరణతో నడిచి వెళుతున్న భక్తులు
మత్స్యగెడ్డ నుంచి బోల్ భం కావడి యాత్ర ప్రారంభించిన భక్తులు
పెదబయలు: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఒడిశా రాష్ట్ర భక్తులు బోల్ భం కావడి యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం జులై,ఆగస్టు నెలల్లో శివ భక్తులు ఐదు రోజుల పాటు దీక్ష చేపట్టి, కావడి యాత్రలో పాల్గొంటారు. దీక్షలో భాగంగా పెదబయలు సమీపంలోని ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో గల మత్స్యగెడ్డ తీరానికి సోమవారం సూర్యోదయానికి ముందే కాషాయ రంగు దుస్తులు ధరించిన భక్తులు చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మత్స్యగెడ్డ నుంచి జలాన్ని కలశాలలోకి సేకరించారు. వాటిని కావడిలో పెట్టి భుజాన వేసుకుని శివ నామస్మరణతో పెదబయలుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడువ శివాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా బోల్ భం నామస్మరణతో ఈ ప్రాంతం మార్మోగింది. కావడిని నేలపై మోపకుండా యాత్ర కొనసాగిస్తామని భక్తులు తెలిపారు. ఆలయానికి చేరుకున్న అనంతరం భక్తిశ్రద్ధలతో ఈ జలాలతో శివుడికి అభిషేకం చేస్తామని పాడువకు చెందిన బోల్ భమ్ భక్తులు సాక్షికి తెలిపారు.ప్రతి ఏడాది ఒడిశా క్యాలెండర్ ప్రకారం ప్రతి శ్రావణ మాసం కావడి యాత్ర ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తామని చెప్పారు.
సాక్షి,పాడేరు: స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో రాజరాజేశ్వరిదేవి శాకంబరి ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహంతో పాటు ఉమానీలకంఠేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను పలు కూరగాయలు,ఆకుకూరలతో అందంగా అలంకరించారు. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు,రమాదేవి,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం,వైదేహి దంపతులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఏడాది శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకుడు రామం పంతులు లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు జరిపారు.వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి వచ్చి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమరాధన నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ తమర్భ నరసింగరావు,మాజీ జెడ్పీచైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ,టూరిజంశాఖ డైరెక్టర్ కిల్లు రమేష్‌నాయుడు,పాడేరు ఉప సర్పంచ్ బూరెడ్డి రాంనాయుడు, వర్తకసంఘం,ఆలయ కమిటీ ప్రతినిధులు,గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా రాజరాజేశ్వరి శాకంబరి ఉత్సవం

ఘనంగా రాజరాజేశ్వరి శాకంబరి ఉత్సవం

ఘనంగా రాజరాజేశ్వరి శాకంబరి ఉత్సవం