
వాగు దాటితేనే చదువులు
ముంచంగిపుట్టు: చదువు కోసం గిరిజన విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ మెట్టగూడ గ్రామానికి చెందిన 21 మంది గిరిజన విద్యార్థులు సోమవారం రెండు కిలో మీటర్లు కాలినడక ప్రయాణించి, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి,లక్ష్మీపురం పాఠశాలకు వచ్చారు.ప్రతి రోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,భారీ వర్షాలు కురిసి వాగు పొంగితే చదువుకు ఆ రోజు దూరం కావాల్సిందేనని గ్రామస్తులు తెలిపారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి, వచ్చేంత వరకు తల్లిదండ్రులు భయం భయంగా ఉంటున్నారు. చదువు కోసం పిల్లలు పడుతున్న అవస్థలను అధికారులు గుర్తించి,మెట్టగూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని,లక్ష్మీపురం వాగుపై వంతెన నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.