స్వామీ.. నీ సన్నిధి చేరి.. | - | Sakshi
Sakshi News home page

స్వామీ.. నీ సన్నిధి చేరి..

Jul 11 2025 6:25 AM | Updated on Jul 11 2025 6:27 AM

సింహాచలం: ఆషాఢ శుద్ధ చతుర్దశి పురస్కరించుకుని జరిగిన సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం గురువారంతో దిగ్విజయంగా ముగిసింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని స్మరిస్తూ బుధవారం చేపట్టిన 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అశేష జనసందోహంతో కొనసాగింది. సింహాచలంలోని తొలి పావంచా వద్ద ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణను ముగించారు. పలువురు భక్తులు సింహగిరికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.

సింహగిరిపై జన జాతర

ఒక పక్క 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు.. మరో పక్క ఆలయ ప్రదక్షిణలకు వచ్చిన భక్తులతో గురువారం సింహగిరి భక్త జనజాతరగా మారింది. దేవస్థానం అంచనాల ప్రకారం.. ఈ సారి గిరి ప్రదక్షిణలో సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. గురువారం ఒక్క రోజే 68 వేల మంది భక్తులు సింహగిరిపై స్వామిని దర్శించుకోగా, బుధవారం 42 వేల మంది దర్శనం చేసుకున్నారు. అలాగే సుమారు 5 వేల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణల్లో పాల్గొన్నారు.

తెల్లవారుజాము నుంచే దర్శనాలు

గిరి ప్రదక్షిణ చేసి సింహగిరికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే స్వామి దర్శనాలకు అనుమతించారు. తొలుత ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తామని ప్రకటించినప్పటికీ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 4.30 గంటల నుంచి రూ.100, రూ.300 టికెట్ల క్యూల్లో కూడా భక్తులను ఉచితంగా పంపించారు. ఆలయ నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే లఘు దర్శనం కల్పించి, అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు.

విశేషంగా ఆలయ ప్రదక్షిణలు

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహగిరిపై గురువారం ఆలయ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను ఆలయ ప్రదక్షిణలకు అనుమతించారు.

అచంచల భక్తితో గిరి ప్రదక్షిణపూర్తి చేసిన భక్తులు

పౌర్ణమి వేళ విశేషంగా ఆలయ ప్రదక్షిణలు

లక్షలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహం

నృసింహుని స్మరణతో మార్మోగిన గిరి మార్గం

ముఖ్యాంశాలు

కొండ దిగువ పాత గోశాల జంక్షన్‌ నుంచి పాత అడవివరం వరకు ఉన్న మార్గం భక్తులతో కిక్కిరిసింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి తొలిపావంచాకు చేరుకునే భక్తులు, ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకునే భక్తులతో రద్దీ నెలకొంది.

గిరి ప్రదక్షిణ ముగించుకుని కొబ్బరికాయలు కొట్టే భక్తులతో తొలిపావంచా గురువారం మధ్యాహ్నం వరకు కిటకిటలాడింది.

మెట్ల మార్గంలో కేవలం సింహగిరికి వెళ్లే భక్తులను మాత్రమే అనుమతించారు. కొండ దిగువకు మెట్ల మార్గంలో అనుమతించలేదు.

సింహగిరి నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి దేవస్థానం 50 ఉచిత బస్సులను నడిపింది.

32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసి సింహగిరి వచ్చిన భక్తులను ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన కింద నుంచి దర్శనానికి, దక్షిణ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన దిగువ నుంచి దర్శన అనంతరం బయటకు పంపించారు.

ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద నాలుగు లైన్లలో ర్యాంపులు ఏర్పాటు చేసి దర్శనాలు కల్పించారు.

సింహగిరిపై అడవివరం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

భక్తులు కొట్టిన కొబ్బరికాయలతో తొలి పావంచా వద్ద పెద్ద ఎత్తున కుప్ప ఏర్పడింది.

సింహగిరిపై అన్నప్రసాద భవనంలో కదంబం, దద్దోజనం ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.

సింహగిరిపై బస్టాండ్‌లో తీవ్ర రద్దీ నెలకొంది. కొండ దిగువకు వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి. అలాగే కొండ దిగువ పాతగోశాల జంక్షన్‌ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.

తొలిపావంచా వద్ద పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం వద్దకు వచ్చిన చాలా మంది భక్తులు తమ బంధువులు కనిపించడం లేదని పోలీసుల సహాయం కోరారు.

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

గిరి ప్రదక్షిణ చేసిన చాలా మంది భక్తులు అడవివరంలోని తొలిపావంచా వద్ద మెట్లపై, రహదారి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో, పలు కల్యాణ మండపాల హాళ్లలో నిద్రించి, ఆ తర్వాత తమ గ్రామాలకు తరలివెళ్లారు.

స్వామీ.. నీ సన్నిధి చేరి..1
1/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

స్వామీ.. నీ సన్నిధి చేరి..2
2/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

స్వామీ.. నీ సన్నిధి చేరి..3
3/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

స్వామీ.. నీ సన్నిధి చేరి..4
4/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

స్వామీ.. నీ సన్నిధి చేరి..5
5/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

స్వామీ.. నీ సన్నిధి చేరి..6
6/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

స్వామీ.. నీ సన్నిధి చేరి..7
7/7

స్వామీ.. నీ సన్నిధి చేరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement