గాడి తప్పుతున్న గిరిజన సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

గాడి తప్పుతున్న గిరిజన సంక్షేమం

Jul 11 2025 6:25 AM | Updated on Jul 11 2025 6:25 AM

గాడి

గాడి తప్పుతున్న గిరిజన సంక్షేమం

సాక్షి, పాడేరు: రాష్ట్రంలోనే 7 లక్షల గిరిజన జనాభా కలిగి ఉన్న అతి పెద్ద పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. ఐదు నెలలుగా ప్రాజెక్టు అధికారి లేక పరిపాలన కుంటుపడింది. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అభిషేక్‌గౌడను ఇన్‌చార్జి పీవోగా వ్యవహరిస్తున్నప్పటికీ పూర్తిస్థాయి పీవో లేక గిరిజన సంక్షేమం గాడితప్పుతోంది. సింగిల్‌ లైన్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పాడేరు ఐటీడీఏ పీవో పోస్టుకు విశేష అధికారాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల డివిజన్‌, మండల స్థాయి అఽధికారులు, ఉద్యోగులంతా ఐటీడీఏ పరిధిలోనే పనిచేస్తారు. ఇంత ప్రాధాన్యత గల పాడేరు ఐటీడీఏ పీవో పోస్టు భర్తీలో కూటమి ప్రభుత్వం చేతులేత్తేసింది. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు రోజువారి ఐటీడీఏకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. ఈఏడాది ఏప్రిల్‌ 21వ తేదిన జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఇన్‌చార్జి పీవోతోనే మమ అనిపించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీల గిరిజనుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల అభివృద్ధికి ఎప్పటికప్పుడు పాలనపరమైన నిర్ణయాలు తీసుకుని ఐటీడీఏకు ఉన్న అపారమైన నిధులు ఖర్చుపెట్టాల్సిన బాధ్యతలన్నీ ఐటీడీఏ పీవో మీదే ఉంటాయి. పీవోగా పనిచేసిన అభిషేక్‌ను పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 3న బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

8 నెలలుగా గిరిజన సంక్షేమ డీడీ పోస్టు ఖాళీ

పాడేరు ఐటీడీఏలో గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టును కూడా కూటమి ప్రభుత్వం 8 నెలలుగా భర్తీ చేయలేదు. పాడేరు సహాయ గిరిజన సంక్షేమశాఖ అధికారి (ఏటీడబ్ల్యూవో) ఎల్‌.రజనిని ఇన్‌చార్జి డీడీగా వ్యవహరించేవారు. ఆమె ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖలో సాధారణ బదిలీలు జరిగినప్పటికీ ప్రభుత్వం పాడేరు డీడీ పోస్టును భర్తీ చేయలేదు. కొత్త డీడీ నియామకం లేకపోవడంతో ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పాడేరు ఏటీడబ్ల్యూవో ఇక్కడ నుంచి రిలీవ్‌ అవ్వలేదు. 8 నెలగా డీడీ పోస్టు ఖాళీగా ఉండడంతో పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన విద్యకు సంబంధించిన ఆంశాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. పాడేరు ఐటీడీఏ పీవోతోపాటు గిరిజన సంక్షేమశాఖ డీడీ పోస్టును భర్తీ చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఏప్రిల్‌లో జరిగిన పాలకవర్గ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. కొన్ని గిరిజన ప్రజా సంఘాల నేతలు మంత్రిని కలిసి వినతులు ఇచ్చినా ఫలితం లేకపోయింది

ఐదు నెలలుగా ఐటీడీఏ పీవో పోస్టు ఖాళీ

గిరిజన సంక్షేమ డీడీ పోస్టుదీ అదే పరిస్థితి

ఇన్‌చార్జి అధికారుల పాలనతో

సంక్షేమానికి ఇబ్బందులు

రెగ్యులర్‌గా సమస్యలు

చెప్పుకోలేకపోతున్న గిరిజనులు

ఐటీడీఏ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం

నిర్లక్ష్యం తగదు

పాడేరు ఐటీడీఏకు రెగ్యులర్‌ పీవోతో పాటు గిరిజన సంక్షేమ డీడీని ప్రభుత్వం నియమించకపోవడంతో ఇబ్బందిగా ఉంది. గిరిజనులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇన్‌చార్జి అధికారుల పర్యవేక్షణలో గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. పెద్ద ఐటీడీఏలో ప్రధాన అధికారుల పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం తగదు. వెంటనే పీవో, డీడీలను నియమించాలి.

– పొద్దు బాలదేవ్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

గాడి తప్పుతున్న గిరిజన సంక్షేమం 1
1/1

గాడి తప్పుతున్న గిరిజన సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement