
రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్
● పీపీపీ విధానంలో అభివృద్ధి.. అందుబాటులోకి 88 క్యాప్సూల్ బెడ్లు ● 3 గంటల వరకు రూ.200, రోజుకు రూ.400 వసూలు ● రైలు ప్యాసింజర్లతో పాటు బయటవారు వినియోగించుకునే సౌకర్యం ● డిమాండ్‌ను బట్టి మరిన్ని స్టేషన్లలో ఏర్పాటుకు ఆలోచన ● వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
విశాఖ సిటీ : విశాఖ రైల్వేస్టేషన్‌లో సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా క్యాప్సూల్ హోటల్ సిద్ధమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్(పీపీపీ) విధానంలో ప్లాట్‌ఫాం నెంబర్–1, గేట్ నెంబర్–3 వద్ద మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోనే తొలిసారిగా ఈ తరహా క్యాప్సూల్ హోటల్‌ను విశాఖలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. గురువారం డీఆర్‌ఎం చాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్‌లో వసతి సౌకర్యాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్న రిటైరింగ్ రూమ్స్ సరిపోక ప్రయాణికులు బయట హోటల్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటు ధరలో సౌకర్యవంతమైన వసతి కల్పించాలన్న ఉద్దేశంతో సరికొత్తగా క్యాప్సూల్ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ తరహా హోటల్స్ ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ వంటి రైల్వేస్టేషన్లలో మాత్రమే ఉన్నాయి.
పీపీపీ విధానంలో అభివృద్ధి
విశాఖ రైల్వే స్టేషన్‌లో కూడా ఆధునిక హంగులు, అందుబాటు ధరలతో క్యాప్సూల్ హోటల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఈ–యాక్షన్ నిర్వహించారు. ఇందులో శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీ అనే సంస్థ ఐదేళ్ల కాలానికి ప్రాజెక్టును దక్కించుకుంది. రైల్వేస్టేషన్ మొదటి అంతస్తులో అధికారులు స్థలాన్ని కేటాయించారు. సదరు కాంట్రాక్టు సంస్థ ఇక్కడ క్యాప్సూల్ హోటల్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో 73 సింగిల్ బెడ్లు, 15 డబుల్ బెడ్లు మొత్తంగా 88 బెడ్లను ఏర్పాటు చేసింది. మహిళల కోసం 18 బెడ్లు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. రైల్వే ప్రయాణికులతో పాటు పర్యాటకులు, బయట వ్యక్తులకు కూడా ఈ హోటల్‌లో వసతి పొందే సౌలభ్యాన్ని కల్పించారు.
3 గంటలలోపు రూ.200
ఈ కొత్త క్యాప్సూల్ హోటల్‌లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు అనేక సదుపాయాలు కల్పించారు. అతిథులకు ఉచిత వైఫై, 24 గంటలు వేడి నీళ్ల సౌకర్యం, పర్యాటకుల కోసం ట్రావెల్ డెస్క్‌తో పాటు ఇన్‌హౌస్ స్నాక్ బార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సింగిల్ బెడ్‌కు 3 గంటలలోపు రూ.200, 3 నుంచి 24 గంటల వరకు రూ.400 వసూలు చేయనున్నారు. అలాగే డబుల్ బెడ్‌కు మూడు గంటలలోపు రూ.300, 3 నుంచి 24 గంటలలోపు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఈ బెడ్స్‌ను బుక్ చేసుకునే సదుపాయం లేదని డీఆర్‌ఎం తెలిపారు. డిమాండ్‌ను బట్టి ఆ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

రైల్వే స్టేషన్‌లో క్యాప్సూల్ హోటల్