
తెరపల్లి క్వారీపై గనులశాఖకు నివేదిక
చింతపల్లి: మండలంలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న తెరపల్లి తెల్లరాయి క్వారీపై 36 అంశాలతో కూడిన నివేదికను గనులశాఖకు సమర్పించనున్నట్టు తహసీల్దారు టి.రామకృష్ణ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెరపల్లి గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నిర్వహించిన సభలో గ్రామస్తులు క్వారీ నిర్వాహకులు వైఖరిని వివరించారన్నారు. ఇందులో భాగంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీ వ్యర్థాలను తమ పంట పొలాల్లో పడేస్తున్నారని దానికి ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వడం లేదని, అనేకమంది అనారోగ్యం పాలవుతున్నట్టు గ్రామానికి చెందిన రాములమ్మ పఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 5న తెరపల్లిలో తెల్లరాయి క్వారీని రెవెన్యూ,పోలీసులు సందర్శించి లోతుగా పరిశీలించినట్టు చెప్పారు.ఈ క్యారీకి 4.2 ఎకారాల్లో తవ్వకాలకు గనుల శాఖ అనుమతులు మంజూరు చేయగా అనధికారికంగా మరో 15 ఎకరాల్లో ఈ క్వారీ తవ్వకాలు చేపడుతున్నట్టు పరిశీలనలో తేలిందన్నారు. గనులశాఖ అనుమతులు పాటించకుండా ఈ తవ్వకాలు జరుగుతున్న అనేక అంఽశాలను గ్రామస్తులు వివరించినట్టు ఆయన చెప్పారు.
గ్రానైట్ క్వారీలో గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, భూములిచ్చిన గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించాలని, పంచాయతీ పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, క్వారీలో పనిచేస్తున్న కార్మికులకు బీమా చేయించాలని, క్వారీ వద్ద వైద్యాధికారిని అందుబాటులో ఉంచాలని నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. పేలుడు పదార్ధాలు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ నివేదికను గనులుశాఖకు పంపుతున్నట్టు తెలిపారు.