
రహదారుల నిర్మాణం వేగవంతం
జి.మాడుగుల: రహదారుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజె అభిషేక్ గౌడ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వివిధ నిర్మాణ పనులను పరిశీలించారు. మండలంలో రూ.440 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న తారురోడ్లు పనులను తనిఖీ చేశారు. రహదారుల నిర్మాణాల్లో తగిన నాణ్యత పాటించాలని ఆయన ఆదేశించారు. ఈ నెలాఖరుకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో పాలకొండ నుంచి రూడిబయలు వరకు రూ.120లక్షలతో 2.5కిలో మీటర్లు రోడ్డు, కోరాపల్లి నుంచి పెద్దకొండ వరకు రూ.144లక్షలతో 2.6కిలో మీటర్లు రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. వీటితోపాటు పెదకొత్తూరు– సారుబయలు వరకు రూ.80లక్షలతో నిర్మిస్తున్న రోడ్డును, కుడ్డంగి జంక్షన్ నుంచి మునికర్లతోగు వరకు రూ.100లక్షలతో జరుగుతున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులకు నాణ్యమైన మెటీరియల్ ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డేవిడ్‌రాజ్, ఏఈఈ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో,
జేసీ అభిషేక్ గౌడ