
సీహెచ్‌వోలు స్థానిక నివాసం తప్పనిసరి
పాడేరు : ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్ ఆఫీసర్స్ (సీహెచ్‌వో)లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానికంగా నివాసం ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ టి. విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. బుధవారం మండలంలోని గుత్తులపుట్టు, మినుములూరు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఆయా చోట్ల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ద్వారా అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. రోగులకు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఆయా చోట్ల రెండో విడత ఐఆర్‌ఎస్ 5శాతం స్ప్రేయింగ్ పనులను పర్యవేక్షించారు. పీహెచ్‌సీల్లో వైద్య సిబ్బంది ముఖ అధారిత హాజరును వారికి కేటాయించిన కేంద్రాల్లో ఉండి మాత్రమే వేసుకోవాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదన్నారు. అన్ని చోట్ల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు. స్థానిక నివాసం లేకపోవడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆరోగ్య విస్తరణాధికారి గుల్లెలి సింహాద్రి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.