
మలేరియాతో చిన్నారి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని రంగబయలు పంచాయతీ లంగాబపోదోర్ గ్రామానికి చెందిన కొర్ర రంజిత(6) కొద్దిరోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతూ పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందింది. రంజిత కొద్దిరోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతోంది. సోమవారం వైస్‌ఎంపీపీ భాగ్యవతి, గ్రామస్తులు చొరవతో ఆమెను లబ్బూరు పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చనిపోయింది. వైద్యులు, సిబ్బంది చెప్పినట్టుగా సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే మా కుమార్తె బతికి ఉండేదని తల్లిదండ్రులు శంకర్‌రావు, బుధోయ్ రోదించారు. బాలిక మృతదేహాన్ని మంగళవారం ఉదయం అంబులెన్స్‌లో లంగాబపోదోర్ గ్రామానికి తరలించారు. ఇలావుండగా ఇదే గ్రామంలో మరికొంతమంది చిన్నారులు జ్వరాలు, దగ్గు తదితర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిని గమనించిన వైస్ ఎంపీపీ భాగ్యవతి, మండల వైఎస్సార్‌సీపీ నేత దేవా తదితరుల వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యాధికారి శ్యామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో లబ్బూరు పీహెచ్‌సీకి ఐదుగురు చిన్నారులను తరలించారు.

మలేరియాతో చిన్నారి మృతి