
10 వేల ఎకరాల్లో కాఫీ మొక్కల పునరుద్ధరణ
● పాడేరు ఐటీడీఏ ఏడీ లకే బొంజుబాబు
● రైతులకు పంపిణీ చేపట్టామని వెల్లడి
చింతపల్లి: పాడేరు డివిజన్‌లో సాగులో ఉన్న 10 వేల ఎకరాల పాత కాఫీ తోటల్లో గ్యాప్ ఫిల్లింగ్‌లో భాగంగా మొక్కల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ లకే బొంజుబాబు తెలిపారు. మంగళవారం ఆయన జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పర్యటించారు. అనంతరం చింతపల్లి మండలంలో బిల్లబడ్డ, బెన్నవరం, నక్కమెట్ట, సూదిమెట్ట గ్రామాల్లో కాఫీ నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి రైతులు సాగుచేసే పాత కాఫీ తోటల్లో పాడైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎకరానికి 450 చొప్పున పంపిణీ చేసేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ మొక్కల నిమిత్తం 234 సెకండరీ నర్సరీలను సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం రైతులకు మొక్కలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల కాఫీ ఏఈవోలు ధర్మారాయ్, చిన్నబ్బాయి, కేవీ రమణ, హెచ్‌సీ అరుణకుమారి, ఎఫ్‌సీలు, లైజన్ వర్కర్లు పాల్గొన్నారు.