
పని గంటల పెంపుతోఅధిక శ్రమదోపిడీ
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
బోనంగి చిన్నయ్యపడాల్
● 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను
విజయవంతం చేయాలని పిలుపు
పాడేరు : పనిగంటల పెంపుతో కార్మికులు, ఉద్యోగుల నుంచి అధిక శ్రమ దోపిడీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ విమర్శించారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రమైన పాడేరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. జీసీసీ కార్యాలయం నుంచి మెయిన్ బజారు, పాత బస్టాండ్, సినిమాహాల్ సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల చేత వెట్టిచాకిరి చేయించుకునేందుకు అదనంగా రెండు గంటలు పెంచి 10గంటల పని దినాలను అమలు చేయడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపి కార్మి కులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల చెల్లింపు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ రద్దు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడు దేశవ్యాప్త సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నాలన్నారు. మెడికల్ ఆండ్ హెల్త్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి నాగరాజు, నాయకులు లక్ష్మణ్, సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు వగ్గు జయరాజ్, పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు అర్జున్, కళాసీల యూనియన్ నాయకులు గౌరినాయుడు, దేముడు, జిల్లా ఆస్పత్రికి కార్మికుల యూనియన్ నాయకులు నగేష్, చిట్టిబాబు, కొండబాబు, బొజ్జన్న, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు పాల్గొన్నారు.