పునరావాసం అవస్థల మయం | - | Sakshi
Sakshi News home page

పునరావాసం అవస్థల మయం

Jun 17 2025 5:11 AM | Updated on Jun 17 2025 5:11 AM

పునరా

పునరావాసం అవస్థల మయం

తొందరగా తేల్చాలి

పునరావాసం విషయంలో అధికారులు ఏదో ఒకటి తొందరగా తేల్చితే బాగుంటుంది. ఇప్పటికే మూడు ప్రాంతాలను చూపించారు. పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం త్వరితగతిన చేపడితే మంచిది. సమావేశాలు, స్థలాల పరిశీలనలతో కాలయాపన జరుగుతోంది.

– బొజ్జా పోతురాజు, చింతూరు

వరదలకు ముందే పునరావాసం కల్పిస్తారనుకున్నా

ప్రతి ఏడాది వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మా గ్రామాన్ని ఫేజ్‌1–బిలో కలిపారు. కాగా ఈ ఏడాది వరదలకు ముందే మాకు పరిహారం అందచేసి పునరావాసం కల్పిస్తారని అనుకున్నా. కాగా ఇంతవరకు స్థలాల ఎంపికే ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఈ ఏడాది కూడా మాకు వరదముప్పు తప్పేలాలేదు.

– నరెడ్ల ఉమామహేశ్వరరావు,

చింతూరు

తిరువూరు ప్రాంతాన్ని కూడా చూపించాలి

అధికారులు ముందుగా మాటిచ్చిన ప్రకారం తిరువూరు ప్రాంతాన్ని కూడా నిర్వాసితులకు చూపించాలి. ఇప్పటికి మూడు ప్రాంతాలు చూపించారు. తిరువూరు ప్రాంతాన్ని కూడా చూసిన అనంతరం పునరావాసానికి ఏది బాగుంటుందో పరిశీలించి అధికారులను మా నిర్ణయం తెలియచేస్తాం.

– పయ్యాల నాగేశ్వరరావు,

చింతూరు

పోలవరం నిర్వాసితులు పునరావాసం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.. ప్రభుత్వం మాత్రం వారితో దోబూచులాడుతోంది. స్థలాల పరిశీలన ముందుకుసాగడం లేదు. నిర్వాసితులు కోరుకుంటున్న ప్రాంతాలను చూపించడంలో అధికారులు కాలయాపనచేస్తున్నారు. దీంతో నిర్వాసితులు తీవ్ర నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేసి, తమను ముంపుముప్పు నుంచి తప్పించాలని వేడుకొంటున్నారు.

చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న తమకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు. స్థలాల పరిశీలనతోనే పోలవరం అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప పునరావాస ప్రక్రియ పూర్తి స్థాయిలో ముందుకు సాగడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వరదలకు ముందే పునరావాసం కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన తమకు నిరాశే మిగిలిందని ఆందోళన చెందుతున్నారు. స్థలాల ఎంపికపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో తమకు ఎప్పుడు పునరావాస కల్పిస్తారో తెలియడం లేదని నిర్వాసితులు అంటున్నారు.

ఫేజ్‌1–బిలో 32 గ్రామాలకు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఫేజ్‌1–బిలో అదనంగా 32 గ్రామాలను చేర్చారు. కూనవరం మండలంలో 3,983 కుటుంబాలు, వీఆర్‌పురం మండలంలో 5,141 కుటుంబాలు, చింతూరు మండలంలో 3,380 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవార్డు ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామసభలు పూర్తిచేసిన అధికారులు చివరగా నిర్వహించే డ్రాఫ్ట్‌ ఆర్‌అండ్‌ఆర్‌ గ్రామసభలకు సన్నద్ధమవుతున్నారు. కాగా నిర్వాసితులకు పరిహారం అందించే విషయంపై పెద్దగా ఇబ్బందులు లేకున్నా పునరావాసం క ల్పించే విషయంలో స్థలాల ఎంపిక మాత్రం అధికారులకు సవాల్‌గా మారుతోంది. 32 గ్రామాల్లోని గిరిజనులకు మరో ప్రాంతంలోని షెడ్యూల్‌ ఏరియాలో, గిరిజనేతరులకు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో పునరావాసం కల్పించాల్సి ఉంది. దీనికోసం ఆయా ప్రాంతాల్లో స్థలాలు ఎంపికచేసి కాలనీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.

గిరిజనులకు ఇలా..

గిరిజనులకు ముందుగా ఎటపాక, కూనవరం మండలాల్లో గతంలో నిర్మించిన కాలనీల్లో పునరావాసం కల్పించాలని భావించినా వారికి ఇవ్వాల్సిన భూమి కి భూమి విషయంలో సాగుభూముల లభ్యత లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో పునరావాస ప్రక్రియను విరమించుకున్నారు. దీంతో వారికి రంపచోడవరం డివిజన్‌లోని గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు అధికారులు స్థలాలను పరిశీలించారు.

గిరిజనేతరులకు..

32 గ్రామాల్లోని గిరిజనేతరులకు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలో పునరావాసం కల్పించేందుకు గాను గతంలో అధికారులు ఏలూరు జిల్లా తాడువాయి, తూర్పుగోదావరి జిల్లా యాదవోలు ప్రాంతాలను చూపించారు. కొంతమంది తాడువాయి ప్రాంతం వైపు మొగ్గుచూపారు. కాగా తమకు తాడువాయితో పాటు తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెం, ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని చాలామంది గిరిజనేతర నిర్వాసితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇటీవల నిర్వాసితులతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గిరిజనేతరులకు గోకవరం సమీపంలోని సూదికొండ, మల్లవరంతో పాటు తాడువాయి, తిరువూరు ప్రాంతా ల్లో స్థలాలు చూపిస్తామని అధికారులు తెలిపారు. దీనిలోభాగంగా అధికారులు బస్సులను ఏర్పాటుచేసి గిరిజనేతర నిర్వాసితులకు కేవలం సూదికొండ, తాడువాయి ప్రాంతాలను మాత్రమే చూపించారు.

ఇతర ప్రాంతాలు కూడా చూపించాలని డిమాండ్‌

తమకు నాలుగు ప్రాంతాలు చూపిస్తామని చెప్పిన అధికారులు సూదికొండ, తాడువాయి ప్రాంతాలను మాత్రమే చూపించారని, తమకు ఇచ్చిన మాట ప్రకారం ఇతర ప్రాంతాలను కూడా చూపించాలని, వాటిలో తమకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకుంటామని గిరిజనేతర నిర్వాసితులు అంటున్నారు. కాగా 32 గ్రామాల్లోని గిరిజనేతర నిర్వాసితుల్లో అత్యధికంగా తిరువూరు ప్రాంతంపె ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తిరువూరు ప్రాంతంలో స్థలాల లభ్యతపై అధికారులు స్పష్టమైన వైఖరి చెప్పకపోవడంతో కొంతమంది నిర్వాసితులు స్వయంగా తిరువూరు ప్రాంతానికి వెళ్లి పునరావాసానికి యోగ్యంగా ఉండే భూములను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడుతున్నారు. తిరువూరు సమీపంలోని అంజనాపురం, జల్లికుంట, పోలిశెట్టిపాడు, కుమ్మరికుంట్ల తదితర ప్రాంతాల్లో మంచి భూములు ఉన్నాయని, విక్రయించేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని, ఆ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు అక్కడ పునరావాస కల్పించాలని గిరిజనేతర నిర్వాసితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులను కలిసి తమకు తిరువూరు ప్రాంతంలో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరేందుకు వారు సిద్ధమవుతున్నారు.

స్థలాలు చూపడంలో తీవ్ర జాప్యం

ఆవేదన వ్యక్తం చేస్తున్న

పోలవరం బాధితులు

నిర్వాసితులు కోరుకున్న ప్రాంతాల

గురించి పట్టించుకోని అధికారులు

ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పదని ఆందోళన

పునరావాసం అవస్థల మయం1
1/4

పునరావాసం అవస్థల మయం

పునరావాసం అవస్థల మయం2
2/4

పునరావాసం అవస్థల మయం

పునరావాసం అవస్థల మయం3
3/4

పునరావాసం అవస్థల మయం

పునరావాసం అవస్థల మయం4
4/4

పునరావాసం అవస్థల మయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement