విద్వేషం.. విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

విద్వేషం.. విధ్వంసం

Jun 11 2025 8:45 AM | Updated on Jun 11 2025 8:45 AM

విద్వ

విద్వేషం.. విధ్వంసం

సాక్షి, అనకాపల్లి: హామీలు గాలికొదిలేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆస్తులు విధ్వంసమైనా, ప్రాణాల మీదకు వచ్చినా.. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు అంటే పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కూటమి పాలనలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిపై హత్యాయత్నం చేశారు. 11 మంది సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పంటలు, ఇళ్లు ధ్వంసం చేశారు.

స్పీకర్‌ ఇలాకాలో దాడులు, దౌర్జన్యాలు..

సాక్షాత్తూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గమైన నర్సీపట్నంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు ఎక్కువగా జరిగాయి. నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకుగానూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ యూత్‌ లీడర్‌ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్యకు యత్నించారు. ఆయన అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇళ్లను కూల్చేశారు. వైబీ పట్నానికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశారు. చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చేయగా, 12 మంది వైఎస్సార్‌సీపీ యువతపై కేసులు నమోదు చేశారు. జూలై 9వ తేదీన మాకవరపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు రామారావు, తల్లిదండ్రులపై కూడా కర్రలతో దాడి చేశారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాకవరపాలెంలోని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఇటీవల ఒక టీడీపీ నేత ట్విట్టర్‌లో పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్‌లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, పార్టీ నేత బండారు గాంధీపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు.

హోంమంత్రి నియోజకవర్గంలో..

పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల గ్రామ శివారు మర్రిచెట్టు ప్రాంతంలో మాడెం వరలక్ష్మి ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీకి చెందిన జవ్వాది ఈశ్వరరావు, జవ్వాది రమేష్‌, బత్తుల అప్పారావు, బత్తుల నరసింహమూర్తి, పబ్బు తుర్రయ్య దాడి చేశారు. మహిళల దుస్తులు చింపి అసభ్యకరంగా దూషించారు. దాడి చేయడమే కాకుండా బాధిత మహిళలపై టీడీపీ వారు కేసులు కూడా పెట్టారు.

నాతవరం మండలం డి.ఎర్రవరంలో ధ్వంసమైన పంట

కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు, ఇద్దరిపై హత్యాయత్నం

11 మంది సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల పంట నాశనం.. ఇళ్లు ధ్వంసం

ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్‌తోపాటు 44 మందిపై కేసులు

సోషల్‌మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు

విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలేనికి చెందిన వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ బోస రమణారెడ్డిపై వివిధ జిల్లాల్లోని పొదిలి, దర్శి, ఇచ్ఛాపురం, నీలకంఠాపురం, పార్వతీపురం పోలీస్‌స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ఒక స్టేషన్‌ తర్వాత మరో స్టేషన్‌కు తిప్పి తీవ్రంగా వేధించారు. ఆయన డిసెంబర్‌ నెలలో విడుదలయ్యారు.

విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో నివాసముంటున్న బోడి వెంకటేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేష్‌లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మొత్తం 17 కేసులు నమోదు చేశారు. ఆయనను తొలుత 2024 నవంబర్‌ 3న అరెస్టు చేశారు. మొత్తం 115 రోజులపాటు రిమాండ్‌లో ఉన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు స్టేషన్‌లో సీఐ సీహెచ్‌ శేషగిరిరావు 15 నిమిషాల్లో 4 వేల గుంజీలు తీయమని ఇబ్బంది పెట్టారు. రాజాం, చినమేరంగి (కురుపాం), విశాఖలో దువ్వాడ, టూటౌన్‌, పరవాడ, సబ్బవరం, మహారాణిపేట, రేపల్లె, పెదకూరపాడు, పాతగుంటూరు, కృష్ణపట్నం, చీరాల, మార్టూరు, గుంటూరు, బాపట్ల, లావేరు, కర్నూల్‌, కడప, విజయవాడ, మైలవరం, మంచిలీపట్నంలలో కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో కండిషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు ప్రసాద్‌ సిద్దు, గోపిరాజు వంకా, సదరం జ్ఞానేష్‌లపై మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు.

విశాఖకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌పై విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు నమోదు చేశారు. కేసులు, విచారణ అంటూ రెండు నెలలు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మొదట 2024 ఆగస్టు 31న పోలీసులు అరెస్టు చేశారు. అతని కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో బెయిల్‌ లభించింది. మళ్లీ 2024 నవంబర్‌లో కొత్త కేసులు పెట్టి అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌లో ఉన్న సమయంలో బాపట్లలో కూడా మరో కేసు నమోదు చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా బాపట్లకు తీసుకువెళ్లి విచారించారు. ఇలా అతడిపై రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం బెయిల్‌ మంజూరు చేశారు.

విద్వేషం.. విధ్వంసం 1
1/2

విద్వేషం.. విధ్వంసం

విద్వేషం.. విధ్వంసం 2
2/2

విద్వేషం.. విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement