ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
డుంబ్రిగుడ: ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం మండలంలోని కొర్రాయి పంచాయతీ అంజోడ అరకు పైనరీ వద్ద వనం–మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించాలని, దీనిలో భాగంగా వనాలు పెంచాలని సూచించారు. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో అడవులు నిర్వీర్యం అవుతున్నాయని, వాటిని ఆరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా పోడు వ్యవసాయానికి అడవులు తగులపెట్టడం, ధూమపానం చేసి అక్కడ వదిలేయడంతో మంటలు వ్యాపించడం తదితర కారణాల వల్ల అడవులు అంతరించిపోతున్నాయన్నారు. వీటిని ప్రజలు బాధ్యతగా నివారిస్తే వాటి మనుగడకు సాధ్యపడుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఒకే రోజు 3.45 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, హరితవలయాల విస్తరణపై ప్రతిజ్ఞ చేశారు. అంతక ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డివిజనల్ అటవీ శాఖధికారి పీవీ సందీప్ రెడ్డి, ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మతో కలిసి మొక్కలను నాటారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు ఆ మొక్కలకు వారి బంధువుల పేర్లను సూచిస్తూ రాశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ దొన్నుదొర, ఎంపీటీసీలు లలిత, దేవదాసు, సర్పంచ్‌లు కొమ్ములు, సీతారం, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, కండ్రుమ్ మాజీ సర్పంచ్ ఆనంద్, అరకు రేంజర్ శ్రీనివాసరావు, బీట్ అధికారులు, ఉద్దంగి వనసరక్షణ సమితుల సభ్యులు పాల్గొన్నారు.
సాక్షి,పాడేరు: మండలంలోని మినుములూరు ఏపీఎఫ్‌డీసీ కాఫీతోటల్లో వనం–మనం కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, కేంద్ర కాఫీ బోర్డు, ఏపీఎఫ్‌డీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది మొక్కలు నాటారు. కాఫీ కార్మికులు, మినుములూరు ప్రజలకు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అలాగే తలారిసింగి కార్యాలయంతో పాటు సుండ్రుపుట్టు అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ పీడీ సూర్యకుమారి, సీడీపీవో ఝాన్సీరాణీ మొక్కలు నాటారు. చిన్నారులతో కూడా నాటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, జీసీసీ డిపోల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొక్కల సంరక్షణ బాధ్యత స్వీకరించాలి :
రంపచోడవరం డీఎఫ్‌వో బబిత
కూనవరం: చెట్ల ఆవశ్యకతపై అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ నియంత్రణపై చొరవ చూపాలని చింతూరు డీఎఫ్‌వో ఎం. బబిత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూనవరం అటవీ రేంజ్ పరిధిలో పైదిగూడెం, రేపాక, బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి ప్రాంతాల్లో గురువారం సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 8,650 మొక్కలను నాటించారు. పైదిగూడెం గిరిజన గ్రామంలో ఆదివాసీ నవ దంపతులు మొరక నవీన్, రమ్యలు డీఎఫ్‌వో సమక్షంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత స్వీకరించాలని కోరారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలకాలని ప్రతిజ్ఞ చేయించారు. సబ్ డీఎప్‌వో కేవీఎస్ రాఘవరావు, జెడ్పీటీసీ గుజ్జా విజయ, సర్పంచ్‌లు కారం పార్వతి, మల్లం పల్లి హేమంత్, రేంజ్ ఆఫీసర్ ఎం కరుణాకర్, డీఆర్‌ఓ అనిల్‌కుమార్,ఎఫ్‌ఎస్‌ఓలు విజయలక్ష్మి, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత: ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ
పాడేరు : ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతలో భాగంగా మొక్కలు నాటాలని ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యవరణ దినోత్సవంలో భాగంగా గురువారం ఐటీడీఏ ఆవరణలో ఐటీడీఏ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, టీడబ్ల్యూ ఇన్‌చార్జి డీడీ రజని, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు.
కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్
అరకు పైనరీలో ఘనంగా
పర్యావరణ దినోత్సవం
మొక్కలు నాటిన ఎమ్మెల్యే మత్స్యలింగం
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ


