మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనే లక్ష్యం
పాడేరు : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీ పిలుపునిచ్చారు. కలెక్టర్ దినేష్‌కుమర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2024లో 316 కేసులు నమోదు చేసి 23,366.25 కిలోల ఎండు గంజాయిని, 91.2 హషిస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 970 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 2025లో ఇప్పటి వరకు 62 కేసులు నమోదు చేసి 7082.74 కిలోల ఎండు గంజాయి, 5.5కిలోల హషిస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని 129 మందిని అరెస్ట్ చేశామన్నారు. డ్రోన్లతో ప్రత్యేక సర్వే చేపట్టి 93.01 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. పదేపదేగా గంజాయి రవాణాకు పాల్పడుతున్న 50 మంది హాబిట్యువల్ నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించామని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 907 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు డీఐజీ తెలిపారు. గంజాయి సాగు, రవాణా, క్రయ,విక్రయాలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే అన్ని రకాల సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు చేసి వారు సంపాదించిన ఆస్తులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు, క్రయ, విక్రయాలు, రవాణా చేసే వారి సమాచారం ఉంటే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్డీపీఎస్ సెల్ :9381123100, 1930(ఈగల్)కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ముద్రించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీతో కలిసి ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన డీఐజీ గోపినాఽథ్ జెట్టీకి ఎస్పీ అమిత్‌బర్దర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ధీరజ్, డీఎస్పీ షేక్ సహాబాజ్ అహ్మద్, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీ
ప్రభుత్వ శాఖలు సమన్వయంతో
పనిచేయాలని పిలుపు
మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనే లక్ష్యం
మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనే లక్ష్యం


