అంబరాన్నంటిన మోదకొండమ్మ సంబరం
మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, మాడుగుల మోదకొండమ్మ తల్లి జాతరకు జనం పోటెత్తారు. అమ్మ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం నాటి వేడుకకు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో విస్తృత ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ప్రతిరూపమైన ఘటాలను నెత్తిన పట్టుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కళ్లు మిరిమిట్లు గొలిపే విధంగా భారీ విద్యుత్ లైటింగ్, తప్పెటగుళ్లు, నేలవేషాల నడుమ అమ్మవారి జాతర నేత్రపర్వంగా జరిగింది. శాసీ్త్రయ నృత్యాలు, కోలాటాలతోపాటు సూపర్‌డూప్ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. అమ్మవారి పండుగ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఆర్యవైఽశ్య మహాసభ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్‌లో భారీ అన్న సమారాధన నిర్వహించారు. అలాగే మోదకొండమ్మ ఆలయ రహదారిలో విశాఖ డెయిరీ మజ్జిగ పంపిణీ చేసింది. పండుగలో అమ్మవారి శక్తి వేషాలతోపాటు పులివేషాలు, తోలుబొమ్మలాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారిని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్, కోట్ని బాలాజీ, ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాపల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ కిముడు రమణమ్మ, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, మాజీ ఎంపీపీ వేవరపు రామధర్మజ, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజుతోపాటు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
గట్టి పోలీసు బందోబస్తు
స్థానిక ఎస్‌ఐ నారాయణరావు ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. జాతరకు సుమారు లక్షమంది పైగా భక్తులు హాజరవుతారని ముందే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా జాగ్రతలు తీసుకొని, ఏర్పాట్లు చేయడంతో అమ్మవారి ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.
అంబరాన్నంటిన మోదకొండమ్మ సంబరం
అంబరాన్నంటిన మోదకొండమ్మ సంబరం


